సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా వివిధ విధులు, అధికారాలు, బాధ్యతలను నిర్దేశించారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గ సభ్యులంతా తమ విధులను సక్రమంగా నిర్వహించేలా చట్టంలో ఆయా అంశాలు సోదాహరణంగా వివరించారు. గ్రామ ప్రథమ పౌరుడిగా వార్డు సభ్యులకు సర్పంచ్ నేతృత్వం వహిస్తారు. వివిధ రూపాల్లో పంచాయతీకి వచ్చే అన్నిరకాల నిధులను సమర్థవంతంగా నిర్వహించేలా వార్డుమెంబర్లకు సర్పంచ్ చేదోడువాదోడుగా నిలుస్తారు. సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
సర్పంచ్‌ల విధులు, బాధ్యతలు..
►చట్టం లేదా ప్రభుత్వ నిబంధనల ద్వారా సంక్రమించిన అధికారాలు వినియోగించుకుని సర్పంచ్ తన విధులు నిర్వహిస్తారు.
►పంచాయతీ కార్యదర్శి కార్యకలాపాలపై సర్పంచ్‌కు పరిపాలనాపరమైన అధికారం. గ్రామ పంచాయతీలు, ఇతర కమిటీలలో ఆమోదించిన తీర్మానాల అమలుకు పంచాయతీ కార్యదర్శుల విధులపై సర్పంచ్‌ల పర్యవేక్షణ ఉంటుంది.
►రోజువారీ పనుల నిమిత్తం ప్రభుత్వ ఆమోదం మేరకు డబ్బు ఖర్చుచేసే అధికారం సర్పంచ్‌లకు ఉంటుంది. ఈ మేరకు చేసిన వ్యయాలకు తదుపరి పంచాయతీ సమావేశంలో ఆమోదం పొందాలి. పంచాయతీల ఆమోదం మేరకు చెల్లింపులు, ధరావతు చెల్లింపులు జరుపుతారు. చెల్లింపు విషయంలో గ్రామపంచాయతీ తీర్మానాలకు లోబడే సర్పంచ్ పనిచేయాలి
►గ్రామంలో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా సర్పంచ్ బాధ్యత వహిస్తారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శిచేసే పనుల పరిశీలన, పారి«శుధ్య కార్మికులు తమ విధులకు సక్రమంగా హాజరయ్యేలా పర్యవేక్షిస్తారు.
► ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చూడాలి. శిథిలాలు తొలగించాలి. పాడుబడిన బావులు, నీటి గుంటలు పూడ్చేయాలి. పిచ్చిచెట్లు నరికివేయాలి.
► పంచాయతీకి విధించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఉద్దేశించిన హరితహారం కార్యక్రమాన్ని సర్పంచ్ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతియేటా నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం పెరిగి పెద్దవయ్యేలా చూడటం సర్పంచ్ బాధ్యత
► ప్రతి ఇంటికి మొక్కలు సరఫరాచేయాలి. వీధులు, ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. మొక్కలను జాగ్రత్తగా కాపాడాలి.
► నెలకు ఒకసారి గ్రామపంచాయతీ సమావేశం నిర్వహించాలి. రెండునెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి.
► వందశాతం పన్నులు వసూలు చేయాలి. పంచాయతీ రికార్డులు, వీధి దీపాల నిర్వహణ, జనన మరణ రికార్డుల నిర్వహణ.
► సర్పంచ్‌లు తమ గ్రామాల్లోనే నివాసముండాలి. గ్రామపంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరుకావాలి. గ్రామపంచాయతీ సమర్థవంతంగా పనిచేసేలా అప్పగించిన విధులను పూర్తిచేయడానికి సర్పంచ్‌ల పర్యవేక్షణ ఉపయోగపడుతుంది.
నిర్లక్ష్యంగా ఉంటే వేటుకూ అవకాశం..
నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గాలకు అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరిగాయి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు పడేందుకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త చట్టంలో నిర్ధేశించిన బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోతే సర్పంచ్‌ల తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశముంది. చట్టప్రకారం తాను నిర్వహించాల్సిన విధుల నిర్వహణలో విఫలమైతే వివరణ ఇచ్చేందుకు సర్పంచ్‌కు అవకాశమిస్తారు. ఈ తర్వాత జిల్లా కలెక్టర్ అతడిని పదవి నుంచి తొలగించవచ్చు. పంచాయతీల నిర్వహణకు కలెక్టర్ లేదా పీఆర్ కమిషనర్, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు పట్టించుకోకపోతే విధుల నుంచి తొలగించే అవకాశముంది. ఒకసారి సర్పంచ్‌గా తొలగిస్తే ఆరేళ్లపాటు సర్పంచ్‌గా పోటీచేయకుండా అనర్హత వేటు వేయొచ్చు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను పంచాయతీ పాలకవర్గాలు రూపొందించుకోవాలి. చట్టంలో సర్పంచ్‌లకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతో పాటు, సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను కట్టబెట్టారు. గ్రామాల్లో అక్రమ లేఅవుట్లకు అనుమతినిచ్చిన పక్షంలో మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాల విషయంలోనూ కఠిన చర్యలుంటాయి. మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీప్లస్‌టు భవనాల నిర్మాణాలకే పంచాయతీలు అనుమతి ఇవ్వొచ్చు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాలి.
ప్రతి ఊళ్లో నర్సరీ...
మొక్కల నిర్వహణలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీ కోసం నర్సరీ ఏర్పాటుతోపాటు ఊళ్లోని ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యత సర్పంచ్‌పై ఉంటుంది. ప్రతీ రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి. వరుసగా మూడుసార్లు గ్రామసభలు నిర్వహించకపోతే సర్పంచ్‌లను తప్పించే వీలుంది.. ప్రతినెలా గ్రామపాలకవర్గం సమావేశమై అభివృద్ధి, ఇతర కార్యకలాపాలు సమీక్షించాలి.
చెత్తపడేస్తే జరిమానా...
గ్రామాలు, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడేస్తే, ఇంటి ఎదుట చెత్త వేస్తే ఆ ఇంటి యజమానికి రూ.500 జరిమానా విధించే అధికారాన్ని సర్పంచ్‌లకు కల్పించారు. ఇంటి నుంచి మురుగునీటిని రోడ్డు మీదకు వదిలితే రూ. ఐదువేలు జరిమానా విధించే అవకాశముంది. ఊళ్లోని ప్రతి కుటుంబం ఆరు మొక్కలు నాటాలని చట్టంలో పేర్కొన్నా, వాటిలో కనీసం మూడింటినైనా నాటాలి. హరితహారంలో ఇచ్చిన మొక్కలను పెంచకపోతే ఇంటి యజమాని నుంచి రెండింతలు ఆస్తిపన్నును జరిమానాగా వసూలు చేసే వీలుంది.
పదునెక్కిన ‘పంచాయతీ’ చట్టం
Published Thu, Feb 7 2019 2:33 AM | Last Updated on Thu, Feb 7 2019 9:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment