‘మద్యం’తర చిక్కులు
►సుప్రీంకోర్టు తీర్పుతో ఎక్సైజ్ శాఖలో కలవరం
►1,450 దుకాణాలు, 425 బార్లు మూసివేత!
►రాష్ట్ర ఖజానాకు రూ.6 కోట్ల గండి
సాక్షి, హైదరాబాద్: మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. నగర, మున్సిపాలిటీ, గ్రామాల గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు మద్యం దుకాణాలు నిర్వహించ రాదని, అలాంటి దుకాణాలను మూడు నెలల్లోపు తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు సర్కారును కలవరపెడుతోంది. ఈ తీర్పు నేప«థ్యంలో రాష్ట్రంలో దాదాపు 1,450 మద్యం దుకాణాలు, 425 బార్లు మూతపడనున్నాయి. రహదారుల వెంట ఇప్పటికే అనుమతించిన మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల లైసెన్స్‌ను వచ్చే ఏడాది మార్చి 30 లోపు రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని మొత్తం 2,143 మద్యం దుకాణాలు, 815 బారుషాపులకు కలిపి రెండేళ్ల కాలానికి లైసెన్స్ ఫీజు రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,752 కోట్లు సమకూరాయి. వ్యాపారులు మూడు నెలలకు ఒక వాయిదా చొప్పున లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ ఏడాది అక్టోబర్‌లోనే లైసెన్స్ రెన్యువల్ చేశారు. మిగిలిన మూడు వాయిదాల సొమ్ముకు వ్యాపారులు బ్యాంకు గ్యారంటీ ఇచ్చారు. కోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదాలపై వ్యాపారులు, అధికారుల్లో కలవరం మొదలైంది.
ఆదాయానికి గండి
రోడ్డు పక్కనున్న దుకాణాలను తొలగిస్తే లైసెన్స్, ప్రివిలేజ్ ఫీజుతోపాటు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. సుమారు రూ.850 కోట్ల లైసెన్స్ ఫీజు, రూ.350 కోట్ల ప్రివిలేజ్ ఫీజ్ పోతుంది. గత ఏడాది మద్యం విక్రయాలను పరిశీలిస్తే నెలకు రూ.1,100 కోట్ల విలువైన విక్రయాలు జరుగుతు న్నాయి. 75 శాతం దుకాణాలు మూత పడుతున్నాయి కాబట్టి ఈలెక్కన చూస్తే దాదాపు రూ.4,500 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు నిలిచిపోతాయి. మద్యం విక్రయాల్లో 70 శాతం డబ్బు వివిధ పన్నుల రూపంలో సర్కారు ఖజానాకు వచ్చి చేరుతుంది. తీర్పు నేపథ్యంలో అంతా కలిపి రూ. 6 వేల కోట్లకు పైగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అబ్కారీ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ ఫీజు దుకాణదారులకు వెనక్కి ఇవ్వకూడదని అధికారులు భావిస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం లైసెన్స్‌డ్ దుకాణాన్ని, బారుషాపును ఒక ప్రాంతం నుంచి అదే జిల్లాలోని వేరొక ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంది. కోర్టు తీర్పు పరిధిలోకి వచ్చే దుకాణదారులకు ఇవే నిబంధనలు అమలు చేసి వారి చేత బలవంతంగానైనా మద్యం దుకాణాలు నడిపించాలని ఎక్సైజ్ అధికారులు ఆలోచి స్తుండగా మద్యం వ్యాపారులు అందుకు విముఖంగా ఉన్నారు.