
ఉపాధి లక్ష్యంగా విద్యా సంస్కరణలు
వృత్తి విద్యా కాలేజీలు, కోర్సులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను నిర్వహించేలా..
లండన్ ప్రపంచ విద్యా సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కాలేజీలు, కోర్సులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను నిర్వహించేలా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. లండన్‌లో ఈనెల 19 నుంచి 21 వరకు జరిగిన ప్రపంచ విద్యా సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు హాజరయ్యారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు మంత్రి తన ప్రసంగంలో వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు చర్యలు చేపడుతున్నామని, అభివృద్ధికి దోహద పడే మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసే విద్యార్థుల స్థాయిని బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు వివరించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్‌లోనూ మా ర్పులు తెస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇస్తూ నేషనల్ స్కిల్స్ అండ్ వొకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందన్నారు.నాణ్యమైన విద్యను అందించేందుకు మండలానికి ఒకటి చొప్పున 464 గురుకుల స్కూళ్లను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.
ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలి
బంగారు తెలంగాణ రూపకల్పనలో ఎన్‌ఆర్‌ఐలంతా భాగస్వాములు కావాలని లండన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. లండన్‌లోని తెలంగాణ ఎన్‌ఆ ర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చ ర్చాగోష్టి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడు తూ తెలంగాణ ఉద్యమంలో ఎన్‌ఆర్‌ఐల పాత్ర చాలా గొప్పదని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకు ప్రతి ఒక్కరు అప్రమత్తం గా ఉండాలని అవసరమైతే పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, కేజీ టు పీజీ వంటి పథకాలపై ఎన్‌ఆర్‌ఐలకు అవగాహన కల్పించారు.