
సెబాస్టియన్ మోసం చేశాడు
నోటుకు ఓటు’ కేసులో వార్తలకెక్కిన సెబాస్టియన్ తమను మోసం చేశాడని కొందుర్గు మండలం ఏన్కిరాల గ్రామానికి...
పాలమూరు: ‘నోటుకు ఓటు’ కేసులో వార్తలకెక్కిన సెబాస్టియన్ తమను మోసం చేశాడని కొందుర్గు మండలం ఏన్కిరాల గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబసభ్యులు సోమవారం జిల్లాకేంద్రంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు. ‘ఐదుగుంటల భూమిని చర్చి నిర్మాణానికి ఇస్తే మీకు ఇల్లు కట్టిస్తానని, మీ కొడుకు రంజిత్‌ను అమెరికాలో చదివించి ఉద్యోగం ఇప్పిస్తానని’ తమతో గిఫ్ట్‌డీడ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించుకున్నాడని రైతు రత్నం, ఆయన భార్య బాలమణి పేర్కొన్నారు.
ఆ తరువాత తమకు తెలియకుండానే 20 గుంటల భూమిని ఆయనపేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వాపోయారు. తమను మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని రద్దు చేసి తమకు ఇవ్వాలని కోరారు. స్థానిక అధికారులకు, గ్రామ పెద్దలకు చెబితే సెబాస్టియన్ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. కలెక్టర్, మంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారని బాధితులు తెలిపారు.