సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ స్టేట్‌మెంట్‌ను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం రికార్డు చేసింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను ఆ బృందం అడిగి తెలుసుకుంది. కాగా దాడిలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు కుడి నుదుటి భాగంలో గాయం కాగా, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్ కుడి భుజా నికి గాయమైంది. ఇరువురికీ స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనలతో హైటెక్‌సిటీలోని కేర్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ బృందం తొలిరోజు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించింది. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేసింది. అనంతరం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించింది.
చదవండి: అసలు ఇదంతా ఎలా జరిగింది?
మరోవైపు దిశ నిందితుల కుటుంబసభ్యులను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ కేసులో A-1,ఆరిఫ్ తండ్రి హుస్సేన్, A-2, జొల్లు శివ తండ్రి జొల్లు రాజప్ప, A-3 జొల్లు నవీన్ తల్లి లక్ష్మీ, A-4 చెన్నకేశవులు తండ్రి కూర్మప్పను నిన్న రాత్రి 10 గంటలకు ఇంటికి పంపించి ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు తీసుకువెళ్లారు. అయితే వారిని ఎక్కడకు తరలించారనే దానిపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.
ఇక హైకోర్టు ఆదేశాలతో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగంలోనే ఉంచారు. భారీ భద్రత మధ్య పోస్ట్‌మార్టం విభాగంలోని ఫ్రీజర్‌లో వాటిని భద్రపరిచారు. సోమవారం రాత్రి 8గంటల వరకూ వాటిని అక్కడే ఉంచనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment