26 వేల మందితో బందోబస్తు
రాజధానిలో గణేశ్ నిమజ్జన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మంగళవారం జరిగే వినాయక నిమజ్జనానికి 26 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. రాష్ట్ర పోలీసుశాఖలోని ప్రత్యేక బెటాలియన్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్, పారామిలిటరీ బలగాలతో కలసి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబరాబాద్, రాచకొండ, సిటీ కమిషనరేట్‌లలో మొత్తం 25,850 విగ్రహాలు ఏర్పాటయ్యాయని, ఒక్క హైదరాబాద్ కమిషన రేట్ పరిధిలోనే 11,572 విగ్రహాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో సగం వరకు విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. నిమజ్జన రూట్‌మ్యాప్ ఆధారంగా మొత్తం సీసీటీవీలను ఏర్పాటు చేశామని, సిటీ కమిషనరేట్, డీజీపీ కార్యాలయంలో కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏరియల్ సర్వే కూడా చేస్తామని వివరించారు. నిమజ్జన బందోబస్తును పర్యవేక్షించేందుకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పదకొండు మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, పదిహేను మంది ఎస్పీలు, ఏడుగురు అదనపు ఎస్పీలు, 132 మంది డీఎస్పీలు, 349 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,209 మంది ఎస్సైలు, 11,642 మంది కానిస్టేబుళ్లను రంగంలోకి దించామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, వాహనదారులకు ఎప్పటికప్పుడు నగర కమిషనరేట్ తగు సూచనలిస్తుందన్నారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌శాఖ, వాటర్ బోర్డు విభాగాలతో అత్యవసర సేవల బృందాలనూ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాల్లో ఇప్పటికే సగం మేర గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, భైంసా, వరంగల్ తదితర సున్నిత ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను రంగంలోకి దించి ప్రశాంత వాతావరణంలో మంగళవారం నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేస్తామని డీజీపీ తెలిపారు. కిందటి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.