సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు 2,300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రెండు ప్రధాన గేట్ల ముందు సాయుధ పోలీసులతో పహారా ఏర్పాటు చేయడమే గాక అడుగడుగునా సాయుధ పోలీసులను నియమించారు. అసెంబ్లీలోకి పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తారు. ఇక అసెంబ్లీ లాబీ, మీడియా పాయింట్‌తో పాటు గ్యాలరీలో సైతం పరిసరాలను కన్నేసి ఉంచేలా సివిల్ దుస్తుల్లో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బందిని పెద్దసంఖ్యలో రంగంలోకి దించారు. ముందు జాగ్రత్త చర్యగా అసెంబ్లీ నలువైపులా సాయుధ పోలీసులతో పికెట్లను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చడమే గాకుండా, దానికి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి అదనపు డీసీపీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు అసెంబ్లీకి కిలోమీటర్ దూరంలో ఎలాంటి ధర్నాలు, ప్రదర్శనలు, పికెటింగ్‌లు, రాస్తారోకోలు తదితర ఆందోళనలు నిర్వహించకుండా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి నిషేధాజ్ఞలను విధించారు. మంగళవారం అసెంబ్లీ వద్ద డ్రెస్ రిహార్సల్ నిర్వహించారు.
పోలీసులకు హెడ్‌క్వార్టర్స్ నుంచి అంతర్గత ఆదేశాలు
అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో ఎలాంటి అతి చర్యలకు పాల్పడవద్దని అన్ని జిల్లాల పోలీసుల అధికారులకు డీజీపీ హెడ్‌క్వార్టర్స్ నుంచి అంతర్గత ఆదేశాలు వెళ్లాయి. అలాగే నగర కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, రేంజ్ డీఐజీలు సమావేశాలు ముగిసేంత వరకు తమ హెడ్‌క్వార్టర్లను వీడరాదని కూడా డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు
Published Wed, Nov 5 2014 5:52 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM
Advertisement