బడుగులకు చిత్తశుద్ధితో సేవలందించాలి
- మహిళ పోలీసులకు హోంమంత్రి నాయిని పిలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి నీతి నిజాయితీతో పని చేయాలని, పేద, బలహీనవర్గాలకు చిత్తశుద్ధితో సేవలందించాలని మహిళాపోలీసులకు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని అప్పా పోలీస్ అకాడమీలో 486 మంది మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుల్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధునీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ తెలంగాణ పోలీసుశాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో ప్రతిష్ట పెరిగిందన్నారు.
పోలీస్ అకాడమీ డెరైక్టర్ డాక్టర్ మాలకొండయ్య మాట్లాడు తూ 1986లో స్థాపించిన అకాడమీలో ఇప్పటివరకు 2865 బ్యాచ్‌ల ద్వారా లక్షారెండు వేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 16 బృందాలుగా ఏర్పడిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు కమాండర్‌గా ఆర్.కీర్తి వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన కవాతు, బ్యాండ్ అందరినీ అలరించా యి.
శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాగజ్యోతి ఆల్‌రౌండర్‌గా నిలవగా వరంగల్‌లో శిక్షణపొందినవారిలో ఆల్‌రౌండర్‌గా రంగారెడ్డి జిల్లాకు చెందిన కె. మంజుల నిలిచారు. ఇండోర్ విభాగంలో బి.సంధ్య, ఖాజా ఉన్నీసాబేగం, బెస్ట్ ఫైరింగ్‌లో వై.రేణుక, జి.రాజేశ్వరి, బెస్ట్ ఇం డోర్, అవుట్ డోర్ విభాగంలో రాధికలు నిల వగా వారికి నాయిని పతకాలను అందజేశారు.