
30 స్కూళ్లు సీజ్
- తనిఖీలను ముమ్మరం చేసిన అధికారులు
- నేడు కూడా కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో:నగరంలో గుర్తింపులేని పాఠశాలలపై విద్యా శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మొదటి రోజు ఓ పాఠశాలను సీజ్ చేయగా రెండో రోజైన శనివారం ఏకంగా 29 పాఠశాలలకు తాళాలు వేశారు. ఆదివారమైనప్పటికీ దాడులను కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో దాడులు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, అంబర్‌పేట్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, చార్మినార్, షేక్‌పేట్, సైదాబాద్, ఖైరతాబాద్, నాంపల్లి, బహదూర్‌పురా, బండ్లగూడ డివిజన్లలో గుర్తింపు లేకుండా నడుస్తున్న 29 ప్రైవేటు పాఠశాలలను శనివారం సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సదరు పాఠశాలల యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఆకస్మిక దాడులు చేసి పాఠశాలలను మూసివేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ దశలో కొన్ని డివిజన్లలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయడంతో ఉన్నతాధికారులు, స్థానిక పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించి ఆయా పాఠశాలలకు తాళాలు వేశారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 113 గుర్తింపులేని పాఠశాలలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. శుక్రవారం ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్ జూలై నాల్గో తేదీ వరకు నిర్వహించనున్నారు. గుర్తింపులేని పాఠశాలల జాబితాలో ఉన్న ట్రెండు పాఠశాలకు వెళ్లిన అధికారులు అప్పటికప్పుడు పీటీఓ(పర్మిషన్ టు ఓపెన్) ఉత్తర్వు జారీచేయడంతో పలువురు అభ్యంతరం చెబుతున్నారు. ఈ ఆకస్మిక దాడుల్లో డీఈఓ సుబ్బారెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురామ్‌శర్మ, తహశీల్దార్లు, పలువురు డిప్యూటీ ఈఓలు, డిప్యూటీ ఐఓఎస్‌లు పాల్గొన్నారు.
చక్కర్లు కొట్టినా అనుమతివ్వలేదు..
నాలుగేళ్ల క్రితం పాఠశాలను ప్రారంభించాను. అప్పటినుంచి ప్రభుత్వ గుర్తింపు కోసం దరఖాస్తు చేసి కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నా.. మా విన్నపాన్ని అధికారులు ఏనాడు పట్టించుకోలేదు. పాఠశాలకు గు ర్తింపులేదంటూ అకస్మాత్తుగా దాడి చేయడం దారు ణం. మా పాఠశాల పక్కనే మరో పాఠశాలకు అనుమ తి లేకపోయినా అధికారులు కనీసం అటువైపు వెళ్లలే దు. దీని వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
- మహ్మద్ ఇమ్రాన్, నాలెడ్జ్‌హబ్ పాఠశాల యజమాని