శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో డిస్మిస్ కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. జీతాలు లేక వారి జీవితాలు x`గా మారాయి. సింగరేణి వ్యాప్తంగా 13 వేల మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారు. హత్య చేసిన వారికి మరణశిక్ష విధించేటప్పుడు చివరి కోరిక ఏమిటి అని అడిగి తీరుస్తారు. కానీ, సింగరేణి యాజమాన్యం డిస్మిస్ కార్మికులపై ఆ మాత్రం జాలి చూపడం లేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నా కనికరించడం లేదు. దీంతో చాలా మంది డిస్మిస్ కార్మికులు కూలినాలీ చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఫలితంగా నాటి బాయి దొరలు నేడు పాలేర్లుగా మారారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయా పార్టీల అభ్యర్థులు కోల్‌బెల్ట్‌లో ప్రచారం చేసేటప్పుడు తాము గెలిస్తే డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఓట్లు దండుకుంటున్నారు తప్ప న్యాయం చేయడం లేదు. ఈసారి కూడా అవే హామీలు ఇస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ, కార్మికులు మాత్రం నిశీతంగా పరిశీలిస్తున్నారు. హామీ నెరవేర్చని వారికి ఓటుతో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనైన చోటు దక్కుతుందని ఆశపడుతున్నారు. అయితే ప్రధాన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చకపోవడం వారికి సమస్యపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
మస్టర్లు తక్కువగా ఉన్నాయనే నెపంతో..
మస్టర్లు తక్కువగా ఉన్నాయనే కారణంతో 1993 నుంచి కార్మికులను డిస్మిస్ చేశారు. సంవత్సరంలో 100 మస్టర్ల కంటే తక్కువగా చేసిన కార్మికులను కనికరం లేకుండా తొలగించారు. ఇలా 2010 వరకు డిస్మిస్ చేస్తూ సింగరేణి యాజమాన్యం వచ్చింది. దీంతో వేలాది మంది కార్మికులు డిస్మిస్ అయి రోడ్లపై పడ్డారు. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగడంతో దిగి వచ్చిన యాజమాన్యం 2000 సంవత్సరంలో హైపవర్ కమిటీ డిస్మిస్ అయిన వారిలో అనారోగ్య కారణాల వల్ల డ్యూటీలు చేయలేదని నిర్ధారించిన 66 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. తరువాత మే 2004లో 85 మందిని తీసుకున్నారు.
ఇంకా పెద్ద ఎత్తున డిస్మిస్ కార్మికులు ఉండటంతో ఉద్యమం ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో తెలంగాణ సంఘాలు వీరికి మద్దతుగా వచ్చాయి. అనంతరం యాజమాన్యం మళ్లీ ఏప్రిల్ 2012లో మళ్లీ హెపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. కఠిన నిబంధనలు పెట్టి మొత్తం 2,249 మందిని కౌన్సిలింగ్‌కు పిలిచి వారిలో 66 మందికే ఉద్యోగాలు ఇచ్చింది. అనంతరం లోకాయుక్తకు దీనిపై కేసు వెళ్లడంతో మరో 420 మందిని తీసుకున్నారు.
కూలీలుగా మారిన కార్మికులు
గతంలో సింగరేణిలో కొంత మద్యానికి వ్యసనంగా మారిన వారు, జులాయి తిరుగుడు వల్ల డ్యూటీలు చేయని వారు డిస్మిస్ బారిన పడ్డారు. మరికొంత మంది కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకులు శారీరక శ్రమకు తట్టుకోలేక ఒకరోజు డ్యూటీ చేస్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉండటం, మరి కొందరు అనారోగ్య కారణాల వల్ల నాగాలు ఎక్కువగా చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఒక్కసారిగా ఉద్యోగం పోవడంతో వారు కూలీలుగా మారారు.
జీతం లేకపోవడం చేసేది లేక అడ్డా కూలీలుగా, హోటళ్లలో పనోళ్లుగా, ఇటుక బట్టీలు, ఆటో నడుపుతూ, వ్యవయసాయ కూలీలుగా మారి చాలా మంది డిస్మిస్ కార్మికుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. తప్పు చేశాం పశ్చత్తాప పడుతున్నామని కనీసం ఒక్కసారి అవకాశం ఇస్తే మరోసారి ఇలా చేయకుండా చక్కగా డ్యూటీ చేసి బతుకుదామని మొర పెట్టుకున్న కూడా ఎవరు పట్టించుకోవడం లేదు.
డిమాండ్లు ఇవే..
ఎలాంటి ఆంక్షలు లేకుండా నాగాల పేరుతో డిస్మిస్ అయిన వారికి ఒక్కసారి అవకాశం కల్పిస్తు ఉద్యోగాల్లోకి తీసుకోవాలి.
50 ఏళ్ల వయస్సు దాటిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. లేదా రూ.8 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి.
డిస్మిస్ కార్మికుడు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా 8 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి.
తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం డిస్మిస్ రహిత సింగరేణిగా చేయాలి.
దుర్భరంగానల్లసూరీళ్ల జీవితాలు
Published Sat, Apr 19 2014 12:50 AM | Last Updated on Mon, Jul 29 2019 5:53 PM
Advertisement
Advertisement