పొంచివున్న జలగండం! | Singur project | Sakshi
Sakshi News home page

పొంచివున్న జలగండం!

Published Wed, Feb 4 2015 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

పొంచివున్న జలగండం!

పొంచివున్న జలగండం!

సింగూరు ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ
 హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు తప్పదా?
 మంజీరాలో ఇన్‌టేక్ వెల్‌కు అందని జలాలు
 
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు అడుగంటి పోతోంది. ప్రస్తుత నీటి మట్టం 517 అడుగుల వద్ద ఉంది. నికర జలాలు 3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వీటిని ఎంత పొదుపుగా వాడుకున్నా మూడు నెలలకు మించి రావు. వేసవి మే  నాటికి జలాలు పూర్తిగా అడుగంటిపోతే.. హైదరాబాద్, మెదక్ జిల్లాలు తాగునీటి కోసం అల్లాడిపోనున్నాయి. ఇదీ లెక్క: ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం 30 టీఎంసీలు.
 
 ఇది పూర్తిగా నిండితే దిగువనున్న నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్‌కు ఖరీఫ్, రబీ పంటల సాగు కోసం 8.3 టీఎంసీల నీళ్లు విడుదల చేయాలి. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆయకట్టుకు 4 టీఎంసీల నీళ్లు ఇవ్వాలి. 4 టీఎంసీల నీరు సింగూరు నుంచి నేరుగా.. మరో 2 టీఎంసీలు మంజీరా ప్రాజెక్టు నుంచి జంటనగరాల తాగునీటి అవసరాల కోసం ఇవ్వాలి. ఏడాదిన కనీసం 2 టీఎంసీల నీళ్లు ఆవిరి రూపంలో పోతుంటాయి. ఇక మిగిలిన 10 టీఎంసీల నీళ్లను డెడ్ స్టోరేజీగా గుర్తిస్తారు. ఈ నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోకూడదు.
 
 అడుగంటిన సింగూరు: గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి  కోసం రోజుకు 120 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) నీటిని, దుబ్బాక, సంగారెడ్డి, గజ్వేల్, మెదక్ పటాన్‌చెరు నియోజకవర్గాల ప్రజల దాహాన్ని తీర్చేందుకు, పరిశ్రమల అవసరాల కోసం మరో 50 ఎంజీడీ నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి నిత్యం విడుదల చేస్తున్నారు. నీటిని సరఫరా చేసే క్రమంలో మరో 20 ఎంజీడీల జలం వృథా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే రోజుకు 190 ఎంజీడీ నీటిని సింగూరు నుంచి తోడేస్తున్నారు. అంటే 35 రోజులకు ఒక టీఎంసీని తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్నారన్న మాట. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో డెడ్‌స్టోరేజీ నీటి మట్టం కూడా అడుగంటి పోయింది. అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పుడు సింగూరు నీటి మట్టం 517 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టు పూడికను పరిగణలోకి తీసుకుంటే కేవలం 7.5 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఇదేరోజున 13.489 టీఎంసీల నీళ్లు ప్రాజెక్టులో ఉన్నాయి. ఇందులో 0.5 టీఎంసీలను త్వరలో జరగబోయే ఏడుపాయల వనదుర్గ జాతర ఉత్సవాల కోసం ఘణపురం ప్రాజెక్టులోకి వదిలేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి మరో 0.7 టీఎంసీల నీళ్లు ఆవిరి రూపంలో వెళ్లిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
  దీంతో ప్రాజెక్టులో నికరంగా మిగిలేది 6.3 టీఎంసీలు మాత్రమే. ఈ నీటిలో మరో మూడు 3 టీఎంసీలలో జలచరాల మనుగడ ఉంటుంది. అడుగున ఉండే ఈ నీరంతా బురద, ఒండ్రు మట్టి, మృత జంతు కళేబరాలతో మిళితమై ఉంటుంది. ఈ జలం తాగటానికి పనికిరాదు. అన్నీపోనూ ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో కనీస తాగునీటి అవసరాల కోసం ఉన్న జలం నిల్వలు కేవలం 3 టీఎంసీలు మాత్రమే. ఈ నీళ్లను ఎంత పొదుపుగా వాడుకున్నా మూడు నెలలకు మించి సరిపోవు. ఎండలు మండే నిండు వేసవి మే మాసంలో తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.
 
 మంజీరా ఎండిపోతోంది
 సంగారెడ్డి మండలం కల్పగురు వద్ద నిర్మించిన మంజీరా ప్రాజెక్టులో నీళ్లు పూర్తిగా అడుగంటి పోయాయి. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా.. పూడిక పేరుకుపోవడంతో నిల్వనీటి సామర్థ్యం 1.5 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతమైతే కేవలం 0.3 టీఎంసీల జలం మాత్రమే ప్రాజెక్టులో ఉన్నాయి.
 
 ఈ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి ప్రజల తాగు నీటి అవసరాల కోసం చక్రియాల్ శివారులో ఇన్‌టేక్ వెల్ కట్టించారు. ఇక్కడి నుంచి నీటిని మూడు నియోజకవర్గాల్లోని గ్రామాలకు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటి పోయి ఇన్‌టేక్ వెల్‌కు నీళ్లు అందకపోవడంతో  నీటిపారుదల శాఖ అధికారులు దాదాపు మీటర్ లోతుతో ఒక పొడవైన కాల్వ తవ్వించి నీళ్లను వెల్‌లోకి పంపిస్తున్నారు. ఇప్పటికైతే గండం గట్టెక్కింది కానీ, రాబోయే రోజుల్లో ఇంకేంత లోతైన కాల్వలు తవ్వాల్సి వస్తుందోనని ఆ శాఖ అధికారులు తలపట్టుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement