
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని 11 అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కలికిరి మండలానికి చెందిన శ్రావణి(28) కుటుంబ సభ్యులతో కలసి మదీనాగూడలో ఉంటోంది. ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీస్ కంపెనీలో పనిచేస్తోంది. శ్రావణికి 18 నెలల క్రితం రామకృష్ణతో వివాహం కాగా, 4 నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది.
అప్పటినుంచి ఆమెకు తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్ రావడంతో చాలా ఆస్పత్రులకు వెళ్లినా తగ్గలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9.30 గంటలకి ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి బయలుదేరిన శ్రావణి 10 గంటల సమయంలో ప్రైమ్ ఎరా కంపెనీ ఉన్న మిలాంజ్ టవర్స్ 11వ అంతస్తు ఎక్కి దూకింది. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. అనారోగ్యం కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లి ఈశ్వరమ్మ పోలీసులకు తెలిపింది.