సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య కేసులో ప్రియుడి అరెస్టు
సికింద్రాబాద్: ప్రియురాలితో పెళ్లికి నిరాకరించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన యువకుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం....వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన కొత్త రాహుల్ (24) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉన్నాడు. ఖమ్మంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లొచ్చే క్రమంలో అక్కడే ఉండే శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక (22)తో రాహుల్‌కు పరిచయం ఏర్పడింది.
కొన్నేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఖమ్మంలో చదువు పూర్తి చేసిన ప్రియాంక గత మార్చిలో హైదరాబాద్‌కు వచ్చి ఎస్సార్‌నగర్‌లో ఉంటూ.. ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరింది. నెల తర్వాత రాహులను కలిసి పెళ్లి చేసుకుందామని కోరగా.. నీతో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమెకు కనిపించడం మానేశాడు. ప్రేమ పేరుతో ఏళ్ల తరబడి తన వెంట తిప్పుకున్న రాహుల్ పెళ్లికి నిరాకరించడంతో ప్రియాంక తట్టుకోలేకపోయింది.
తీవ్ర మనోవేదనతో గతనెల 23న సికింద్రాబాద్ సమీపంలోని జేమ్స్‌స్ట్రీట్- ఎస్సార్‌నగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్‌ల మధ్య రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో ఆమె రాసి సూసైడ్ నోట్ దొరికింది.
వరంగల్‌కు చెందిన రాహుల్ ప్రేమపేరుతో తన మోసం చేయడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని ప్రియాంక ఆ నోట్‌లో పేర్కొంది. సూసైడ్‌నోట్ ఆధారంగా రాహుల్ కోసం గాలింపు చేపట్టని రైల్వేపోలీసులు ఆదివారం అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.