మరపురాని పీడకలు.. | some crimes in 2014 | Sakshi
Sakshi News home page

మరపురాని పీడకలు..

Published Sun, Dec 28 2014 10:52 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

మరపురాని పీడకలు.. - Sakshi

మరపురాని పీడకలు..

ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలతో జిల్లా అతలాకుతలమైంది. ముఖ్యంగా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైలు, బస్సు ఢీకొన్న దుర్ఘటన మరపురాని పీడకలగా మిగిలిపోయింది. ఈ ప్రమాదం 16 మంది చిన్నారులతో పాటు డ్రైవర్, క్లీనర్‌లను పొట్టనపెట్టుకోవడం యావత్ దేశాన్నే కలిచివేసింది. ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.

కాగా వేలాదిగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా వాహనాల అతివేగం, అజాగ్రత్త కారణంగానే వందలాది మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. వేగం కన్నా విలువైన ప్రాణాలు మిన్న అనే దృక్పథంతో వాహనదారులందరూ మెలిగినప్పుడే ప్రమాదాలకు పూర్తిగా తెరపడుతుంది. ఆ దిశగా కొంగొత్త ఏడాదిలోకి అందరం సంతోషంగా అడుగిడదాం.      

జిల్లాలోని రహదారులన్నీ రక్తసిక్తమయ్యాయి. ముఖ్యంగా రాజీవ్హ్రదారి, 44వ, 65వ నంబరు జాతీయ రహదారులు నెత్తురోడాయి. రోడ్డు ప్రమాద సూచనలను పాటించకపోవడం, సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వంటి నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా వారి ప్రాణాలే బలికావడంతో పాటు వారి కుటుంబీకులకు కూడా తీరని విషాదాన్ని కల్గిస్తున్నాయి. జిల్లాలోని 65వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న జహీరాబాద్, రంజోల్, మునిపల్లి, బుదేరా చౌరస్తా, సదాశివపేట, పెద్దాపూర్, కంది ప్రాంతాలు, రాజీవ్ రహదారిలోని వర్గల్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్‌తో పాటు తూప్రాన్ ప్రాంతాల్లో ప్రమాదాలు వేల సంఖ్యలో జరిగాయి.

65వ నంబరు జాతీయ రహదారి నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు సకాలంలో జరగకపోవడం వల్ల కూడా ప్రమాదాల సంఖ్య పెరిగింది. పోతిరెడ్డిపల్లి నుంచి జహీరాబాద్ వరకు సింగిల్ రోడ్డు ఉండటం, భారీ వాహనాలు ప్రతినిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే ఈ రోడ్డు హైదరాబాద్- ముంబాయ్ జాతీయ రహదారి కావడంతో ఈ రోడ్డుపై రోజూ వేల కొద్దీ భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ తిరుగుతుంటాయి. ముఖ్యంగా టూరిజం బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా షిర్డీకి ప్రతినిత్యం వెళ్తుంటాయి.

భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో రోడ్డు సరిగ్గా లేకపోవడం, డ్రైవర్ల అతివేగం, అజాగ్రత్త వల్ల వేల ల్లో ప్రమాదాలు ఈ రోడ్డుపై చోటు చేసుకున్నాయి. ఇక 44వ నంబరు జాతీయ రహదారితో పాటు రాజీవ్ రహదారిపై మూల మలుపుల్లో వాహన డ్రైవర్లు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడపడం వంటి కారణాల వల్ల వేల  సంఖ్యలో ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలనే కుదిపేశాయి. తూప్రాన్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైలు, స్కూల్ బస్సును ఢీకొన్న ప్రమాదంలో 16 మంది చిన్నారుల జీవితాలను చిదిమేసింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, క్లీనర్ల ప్రాణాలూ హరీమన్నాయి.

ఈ దుర్ఘటన ఇప్పటికీ ఇంకా మాయని మచ్చగానే మిగిలిపోయింది. బాధిత కుటుంబీకులు ఇంకా ఈ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. గత ఏడాది 2013లో మొత్తం 1655 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 800 మంది మృత్యువాత పడ్డారు. 2131 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుత 2014లో మొత్తం 1287 ప్రమాదాలు చోటు చేసుకోగా 684 మంది మృత్యువాత పడ్డారు. 1605 మంది గాయపడ్డారు.
 
ఎన్.హెచ్.లపై సిట్టింగులూ ఓ కారణం
జిల్లాలోని 44, 65వ న ంబరు జాతీయ రహదారులతో పాటు రాజీవ్ రహదారుల వెంట అనేక దాబాలు ఉన్నాయి. ఆయా దాబాల్లో రాత్రి వేళల్లో మద్యం సిట్టింగులు కొనసాగిస్తుండడం వల్ల వాహన చోదకులు మద్యం తాగి వాహనాలను నడపడంతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మద్యం మత్తులో ఎంత వేగంగా వెళ్తున్నదీ.. ఎదురుగా ఏ వాహనం వస్తున్నదీ... సరిగ్గా తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు.  దీంతో ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయి. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు అనేక సందర్భాల్లో హెచ్చరిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతోంది.
 
మచ్చుకు కొన్ని దుర్ఘటనలు
వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొని 16 మంది చిన్నారులు, డ్రైవర్, క్లీనర్ మృత్యువాత పడ్డారు. తూప్రాన్ వద్ద ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. సంగారె డ్డి మండలం కంది వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మునిపల్లి మండలం బుదేరా చౌరస్తా వద్ద కర్నాటక బస్సు ప్రమాదంలో 29 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వర్గల్ మండలం సింగాయపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

పుల్కల్ మండలం శివ్వంపేట వద్ద బైక్‌ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి చెందింది. జహీరాబాద్ సమీపంలోని కారు-లారీ ఢీకొన్న ప్రమాదంలో జహీరాబాద్‌కు చెందిన భార్యా భర్తలు మరణించారు. జహీరాబాద్ మండలం బూచనెల్లి వద్ద కారు-లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement