
పది సూత్రాలతో స్పెషల్ డ్రైవ్
గురుకుల్ భూము ల్లో అక్రవూలకు కట్టడి నాలుగో రోజు 11 భవనాల సీజ్
ఎన్ కన్వెన్షన్‌పైనా అధికారుల సర్వే
అక్రవూలు జరగకుండా ప్రచారం
సీఎంను కలిసేందుకు వచ్చిన బాధితులు
అపారుుంట్‌మెంట్ లేకపోవడంతో నిరాకరణ
హైదరాబాద్: గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని భవనాలను సీజ్ చేసే పనిని జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం ప్రారంభించారు. తొలిదశలో నిర్మాణం జరుగుతున్న భవనాలను కూల్చివేసిన అధికారులు రెండో దశలో భాగంగా నిర్మాణం పూర్తయి.. ఖాళీగా ఉన్న భవనాలను సీజ్ చేసే పనిని చేపట్టి 11 భవనాలను సీజ్ చేశారు. ట్రస్ట్ భూముల పరిరక్షణకు పది సూత్రాలతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
కూల్చివేతలుంటాయి..
నిర్మాణం జరుగుతున్న భవనాల కూల్చివేతలు ఇంకా ఉంటాయని సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. అలాంటి కొన్ని భవనాలు గుర్తించామని, పాటించాల్సిన విధివిధానాలు పూర్తికాగానే వాటిని కూల్చివేస్తామని చెప్పారు. ఖాళీ స్థలాలు, ప్లాట్లు, భవనాలు కొనేముందు వాటిని కొనవచ్చా, లేదా, అనే అంశంపై తగిన అవగాహన లేకే చాలామంది గురుకుల్‌ట్రస్ట్‌లో కొనుగోళ్లు చేశారన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రజలకు తగిన అవగాహన కల్పించేందుకు భారీయెత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా జీహెచ్‌ఎంసీకి ఉందని, ఉల్లంఘనులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందన్నారు. అక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనప్పటికీ, విద్యుత్, నీటి సదుపాయాలు పొందిన భవనాలకు వాటిని తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు మరోమారు లేఖ రాస్తామని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ అక్రమ కట్టడాలను అడ్డుకునేందుకు వివిధ విభాగాల సీనియర్ అధికారులు స్పెషల్‌డ్రైవ్‌పై శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం కోసం 200 మందికి పైగా పోలీసులను విధుల్లో ఉంచుతున్నామన్నారు.
ఎన్ కన్వెన్షన్‌పై సర్వే..
ట్రస్ట్ భూముల్లో చర్యలకు సిద్ధమైన అధికారులు సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పైనా దృష్టి సారించారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ ఉందనే అభిప్రాయాలుండటంతో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, నీటిపారుదల శాఖల అధికారులు సర్వే కార్యక్రమాలు చేపట్టారు. సర్వే పూర్తయ్యాక.. ఎఫ్‌టీఎల్ మేరకు మార్కింగ్ చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే ఎన్ కన్వెన్షన్‌కు సైతం నోటీసు జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి కూల్చివేతలు జరుపకుండా కోర్టు స్టే ఉన్నట్లు సమాచారం.
దొరకని సీఎం అపాయింట్‌మెంట్
కూల్చివేతలు ఆపాలంటూ వినతిపత్రం ఇచ్చేందుకు అయ్యప్ప సొసైటీ వాసులు సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ముందస్తు అపాయింట్‌మెంట్ లేకపోవడంతో వారికి సీఎంను కలిసే అవకాశం లభించలేదు. అయ్యప్ప సొసైటీ సంక్షేమ సంఘం కార్యదర్శి ప్రసాద్ నేతృత్వంలో దాదాపు 150 మంది వెళ్లారు. కూల్చివేతల అనంతరం అయ్యప్పసొసైటీలోని 60 అడుగుల రోడ్డులో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని బ్యానర్‌లు కట్టడంతో సొసైటీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. సీఎల్‌పీ నాయకులు జానారెడ్డి, డీఎస్‌లను కలిసినట్లు తెలిసింది. తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సవూచారం. కాగా, ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకొని తమ సమస్యను వినిపించాలని అయ్యప్ప సొసైటీ వాసులు యుత్నిస్తున్నారు.
పది సూత్రాలివీ...
1. గురుకుల్ ట్రస్ట్‌లోని భూములు కొనవ ద్దని ప్రచారం
2. అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తామని ఆయా ప్రవేశ మార్గాల వద్ద హెచ్చరికల బోర్డులు.
3. అక్రమ నిర్మాణాలపై ‘అక్రమ కట్టడం’ అని కనిపించేలా ఎర్రరంగుతో రాయుడం.
4. కూల్చివేతల ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత
5. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని టీజీఎస్‌పీడీసీఎల్‌కు మరోమారు లేఖ
6. నీటి కనెక్షన్లు ఇవ్వవద్దని జలమండలికి లేఖ
7. విద్యుత్ కనెక్షన్లు ఉన్నవారి నుంచి మూడు రెట్ల ఫీజు విధింపు వర్తింపచేయాలని టీజీఎస్‌పీడీసీఎల్‌కు లేఖ
8. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఉన్న తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
9. నిర్మాణాలు జరుగుతున్న మిగతా భవనాల కూల్చివేత
10.నిర్మాణం పూర్తయిన భవనాల సీజ్