- జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలో...
- ఉన్నవారి పైనే మోయలేని భారం
- ఔట్‌సోర్సింగ్ వారికి వేతనాల్లేవు
- పని లేని విభాగాల్లో అదనపు సిబ్బంది
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జిల్లా ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీలోని ఎన్నికల విభాగంలో తగినంతమంది సిబ్బంది లేక ఇబ్బందవుతోంది. ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం వివిధ విభాగాలు.. ఆయా విభాగాలకు తగినంతమంది సిబ్బంది.. ఆయా పనుల నిర్వహణకు నోడల్ ఆఫీసర్లు.. వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఆయా విభాగాల అధికారులు.. నియమావళి ఉల్లంఘనలను పరిశీలించేందుకకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ వంటి ఏర్పాట్లున్నాయి.
కానీ ఎన్నికలకు సంబంధించిన కార్యాలయ విధులను నిర్వహించేందుకు తగినంతమంది సిబ్బంది లేరు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగమే జన గణన తదితర విధులు నిర్వహిస్తోంది. స్పెషల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ వంటి ఉన్నత పోస్టులు పోను కార్యాలయ పనులకు సంబంధించిన విధుల నిర్వహణలో ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ముగ్గురు ఎల్‌డీసీలు మాత్రం ఉన్నారు. వీరికి సహాయకులుగా ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఓటర్ల జాబితా లో పేర్ల నమోదుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన నుంచి అర్హులను జాబితాలో చేర్చడం వరకు.. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు.. ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల పనుల క్రోడీకరణ తదితర బాధ్యతలన్నీ ఈ విభాగంపై ఉన్నాయి. ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ పోతుండటంతో, ఆ మేరకు వీరికి పనిభారం పెరుగుతోంది.
పెరిగిన దరఖాస్తులకు అనుగుణంగా కొత్తగా పెరిగిన ఓటర్లు.. పురుషు లు, మహిళల నిష్పత్తి.. కొత్త ఓటర్లు.. వయస్సుల వారీగా ఓటర్ల విభజన, డూప్లికేట్లను గుర్తించ డం తదితర బాధ్యతలన్నీ వీరిపైనే ఉంటున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఇలాంటి పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాల్సి ఉండటంతో, ఉన్న సిబ్బందిపైనే మోయలేని భారం పడుతోంది. ఉన్నతాధికారులు తరచూ నిర్వహిస్తున్న సమీక్షలకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించడం ఇతరత్రా బాధ్యతలూ వీరిపైనే ఉన్నాయి. దీంతో, ఈ విభాగంలోని ఉద్యోగులు పని ఒత్తిడితో తరచూ ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఓవైపు ఎన్నికల సమయం కావడంతో సెలవులు తీసుకోలేకపోవడం.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో వారు సతమతమవుతున్నారు. కార్యాలయంలోని విధులతోపాటు ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరే సమస్త సమాచారాన్ని ఆగమేఘాల మీద అందజేయలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల నమోదు సందర్భంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు తదితర పనుల్లోనూ వీరిని భాగస్వాములను చేస్తున్నారు.
ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు ఉన్న సిబ్బందితోనే జీహెచ్‌ఎంసీగా మారాక కూడా నెట్టుకొస్తున్నారు. స్టాఫింగ్ ప్యాట్రన్‌పై సిఫార్సు చేసిన ప్రసాదరావు కమిటీ సైతం జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలో అవసరమైనంతమంది సిబ్బంది లేక లోపభూయిష్టంగా ఉందని పేర్కొంది. పనితీరు మెరుగుపడాలంటే కొత్తగా తీసుకోవాల్సిన 145 మంది అసిస్టెంట్ కమిషనర్లలో కొందరిని ఎన్నికల విభాగంలో నియమించాలని కూడా సూచించింది.
వారితో పాటు అదనపు సిబ్బంది అవసరమని పేర్కొంది. ఆ నియామకాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగానైనా అదనపు సిబ్బంది అవసరం ఉంది. ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గత ఐదునెలలుగా వేతనాలు అందకపోయినా పట్టించుకున్నవారు లేరు. ఓవైపు వేతనాల్లేక, మరోవైపు అద నపు భారం మోయలేక వారు సతమతమవుతున్నారు.
పనుల్లేని చోట అదనపు సిబ్బంది
ఎన్నికల సమయంలో.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలో తగినంతమంది సిబ్బంది లేకపోవడం ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు పనులు పెద్దగా లేని పలు విభాగాల్లో భారీ సిబ్బంది ఉన్నారు. అవసరమున్నా, లేకపోయినా వివిధ కారణాలతో పలువురిని ఆయా విభాగాల్లో తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులే కాక.. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లోనూ ఇదే వరుస. పైరవీలతో.. పై వారి ఆదేశాలతో ఇబ్బడి ముబ్బడిగా తీసుకున్న వారిని ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
మేయర్, కమిషనర్ కార్యాలయాల్లో సైతం లేనంతమంది సిబ్బంది కొందరు హెచ్‌ఓడీల అజమాయిషీలో పనిచేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న వారిలోనూ కొందరు హెచ్‌ఓడీలకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) వంటి వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వారు చేసే పనులేమిటో ఎవరికీ తెలియదు. కారుణ్య నియామకాల కింద తీసుకున్నవారితో పాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో తీసుకున్న పలువురికి పని చూపించలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో అత్యవసర పనులున్న సమయంలో సైతం ఎన్నికల విభాగంలో అవసరమైనంతమంది సిబ్బంది లేకపోవడమే విచిత్రం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అంశాల్ని పరిశీలించి, అదనపు సిబ్బంది ఉన్న విభాగాల్లోని వారిని సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న విభాగాల్లో నియమించాలని పలువురు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు కోరుతున్నారు.
సమస్యలివీ...
జీహెచ్‌ఎంసీకి ఎన్నికల విభాగానికి 2 సూపరింటెండెంట్ల పోస్టులు మంజూరు కాగా, ఒక్కరే పనిచేస్తున్నారు.
యూసీడీ పోస్టులు మంజూరైనవి 17.
పనిచేస్తున్నది ఇద్దరు.
ఎల్‌డీసీ పోస్టులు 24 మంజూరైనా, ఆరుగురు మాత్రమే ఉన్నారు.
గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎన్నికల విభాగంలో 24 మంది కంప్యూటర్
ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్నారు. వారికి గత ఐదునెలలుగా వేతనాల్లేవు.