ఖమ్మం జిల్లా తోటపల్లిలో రెండు రాష్ట్రాలను విడదీసే రహదారి
సరిహద్దుల ఏర్పాటుపై తప్పని ఇబ్బందులు ముంపు ప్రాంత ఉద్యోగుల్లో ఆవేదన
భద్రాచలం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో.. పోలవరం ముంపు పరిధిలోకి వచ్చే 211 గ్రామాలను ఖమ్మం జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విలీనం చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావటంతో జిల్లా అధికారయంత్రాంగమంతా విభజన నివేదికల తయారీలో తలమునకలయ్యారు. జిల్లాలోని భద్రాచలం డివిజన్‌లోని భద్రాచలం, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో గల 98 రెవెన్యూ గ్రామాలు(123 హేబిటేషన్లు) తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయనున్నారు. అదే విధంగా పాల్వంచ డివిజన్‌లోని 38 రెవెన్యూ గ్రామాలు (88 హేబిటేషన్లు) జిల్లా నుంచి వేరు చేసి పశ్చిమగోదావరిలో కలపనున్నారు.
మొత్తంగా జిల్లా నుంచి ఏడు మండలాల్లో గల 1,16,796 మందిని ఉభయగోదావరి జిల్లాల్లో కలిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. అయితే ముంపు పరిధిలో ఉన్న గ్రామాలకు సరిహద్దుల ఏర్పాటుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. భద్రాచలం, చింతూరు, బూర్గంపాడు మండలాల్లో సరిహద్దు బోర్డుల ఏర్పాటు కత్తిమీద సామేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. బూర్గంపాడు రెవెన్యూ గ్రామాన్ని బిల్లులో చేర్చటంతో దీని పరిధిలో ఉన్న లక్ష్మీపురాన్ని కూడా వేరు చేయాల్సి ఉంటుంది. ఖమ్మం నుంచి కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలానికి వచ్చేందుకు లక్ష్మీపురాన్ని దాటాల్సి ఉంటుంది.
ఇది ఒకరకంగా ఇబ్బందికరమైన సమస్యే. అదే విధంగా చింతూరు మండలంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిసే చింతూరు, చట్టి గ్రామాలను దాటుకొని తెలంగాణలో ఉండే మోతుగూడెం వైపు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఎక్కడ రాష్ట్ర సరిహద్దు ఏర్పాటు చేయాలనే దానిపై కూడా అధికారులు సైతం ఆలోచనలో పడ్డారు. కాగా, విభజన నేపథ్యంలో జూన్ 2 తరువాత జిల్లాలోని 7 మండలాల్లో గల 211 గ్రామాల పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వేరు చేస్తారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ముంపు పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.