
ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గం
కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం: హరీశ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 23 వరకు జరగనున్న కృష్ణా పుష్కరాలకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గేది లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఒక్క భక్తునికి కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన నాగార్జునసాగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సాగర్‌లో మూడు చోట్ల పుష్కరఘాట్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల నిర్వహణలో తెలంగాణకు దేశంలోనే మంచి పేరు వచ్చిందని, అదే రీతిలో కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 86 పుష్కర ఘాట్‌లను 4,852 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తామని, పుష్కరాల కోసం రూ. 212 కోట్లు కేటాయించామని చెప్పారు. పుష్కరాల ప్రారంభానికి కేవలం రెండున్నర నెలలు మాత్రమే సమయం ఉన్నందున పనులను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.
వర్షాకాలంలో పుష్కరాలు జరగనున్నందున కృష్ణా నదిలో ఎన్ని నీళ్లు వచ్చినా ఇబ్బంది లేకుండా ఘాట్లను నిర్మిస్తామన్నారు. ఈ పర్యటనలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.