పురుగుల అన్నం, నీళ్ల చారు, ముదిరిన కూరగాయలతో వండిన వంటలు తినలేకపోతున్నాం..
కందుకూరు: పురుగుల అన్నం, నీళ్ల చారు, ముదిరిన కూరగాయలతో వండిన వంటలు తినలేకపోతున్నాం.. ఈ భోజనం మాకొద్దు.. అంటూ కందుకూరు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థులు పేట్లలో పెట్టుకున్న భోజనంతోసహా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారికి ఏబీవీపీ నాయకులు మద్దతు తెలిపారు.
వివరాలు.. ఆ పాఠశాలలో తరచూ మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతోపాటు నీళ్ల చారు, ముదిరిన కూరగాయలతోనే వండి వడ్డిస్తుండటంతో ఈ విషయాన్ని విద్యార్థులు చాలామార్లు ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఇదే తీరు పునరావృతం కావడంతో ఏబీవీపీ ఆధ్యర్యంలో బుధవారం అన్నం పేట్లతోసహా వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సామ సురేందర్‌రెడ్డి, మండల కన్వీనర్ అండేకార్ శ్రీనివాస్, టౌన్ కార్యదర్శి మీగడి లక్ష్మణ్, అరుణ్ తదితరులు మాట్లాడారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం తాగునీరు లేక సమీపంలోని ఇళ్లకు వెళ్లి తాగాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు.
మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదన్నారు. ప్రధానోపాధ్యాయడు మొదటి పీరియడ్ మాత్రమే ఉండి మిగతా సమయాల్లో కన్పించడం లేదని ఆరోపించారు. సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించాలని కోరారు. కాగా తహసీల్దార్ సుశీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.