హాస్టల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి | Suspicious death of a hostel student | Sakshi
Sakshi News home page

హాస్టల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Published Wed, Nov 12 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

Suspicious death of a hostel student

తిరుమలాయపాలెం : విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు సాం ఘిక సంక్షేమ హాస్టల్‌కు వచ్చిన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం హాస్టల్ నుంచి అదృశ్యమైన ఆ బాలిక హాస్టల్ ఆవరణలోని బావిలోనే మృతి చెంది ఉండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, స్థానిక విద్యార్థుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

వరంగల్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన బాణోత్ వీరన్న, మంగమ్మల మూడోకుమార్తె శిల్ప(13) మూడు సంవత్సరాలుగా ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న శిల్పను ఇటీవల హాస్టల్ ఎదురుగా ఉంటున్న కస్తూరి అనే మహిళ తన భర్తతో మాట్లాడుతున్నావంటూ తోటి విద్యార్థినుల ముందు అసభ్యకరంగా ధూషించింది.

దీంతో మనస్తాపానికి గురైన శిల్ప తన తల్లిదండ్రులకు ఫోన్ చేస్తానని చెప్పి బయటకువచ్చి తిరిగి హాస్టల్‌కు వెళ్ల లేదు. దీంతో హాస్టల్ వార్డెన్ శశిరేఖ గ్రామంలో శిల్ప గురించి విచారించినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రుల వద్దకు కూడా చేరకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 విచారణ చేపట్టిన పోలీసులు విద్యార్థినిని ధూషించిన కస్తూరిని, ఆమె భర్త ఉపేందర్‌ను విచారించారు. ఈ క్రమంలో హాస్టల్ ఆవరణలోని బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో సిబ్బంది వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటనర్సయ్య, ఏఎస్‌డబ్ల్యూఓ యూసఫ్ అలీ, తహశీలాదర్ శివదాసు, ఎంపీడీఓ సన్యాసయ్య, ఎంపీపీ కొప్పుల అశోక్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై జాన్‌రెడ్డిలు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు...
 హాస్టల్ నుంచి బయటకువెళ్లిన బాలికతిరిగి హా స్టల్‌లోకి ఎలావచ్చింది.. ఆదివారం ఉదయం విద్యార్థినులంతా హాస్టల్‌లో ఉండగా బావిలో దూకి ఎలా ఆత్మహత్యకు పాల్పడింది.. అనే విషయాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బావికి పైకప్పుగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసినప్పటికీ రెండువైపులా మనుషులు ప్రవేశించే విధంగా వదిలేశారు.
 
 న్యాయం చేయాలంటూ ఆందోళన
 తమ కుమార్తె మృతి చెందిందనే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తండ్రి వీరన్న కుమార్తె మృతదేహం ఉన్న బావిలో దూకేందు కు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తో టి విద్యార్థులు కూడా హాస్టల్‌లో జరిగిన సంఘటనతో భయబ్రాంతులకు గురయ్యారు. తమ కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ తల్లిదండ్రులతో పాటు బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట బైఠాయించారు.

తమ కుమార్తెను ఓ మహిళ కొట్టి, తిట్టిందనే విషయంపై హాస్టల్ అధికారులు తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందని, రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ధర్నా చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమించాలని నచ్చజెప్పినా వినలేదు.

దీంతో సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటనర్సయ్య ప్రభుత్వ పరంగా విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తెస్తామని, హాస్టల్ వార్డెన్‌తో పాటు వాచ్‌మెన్‌ను సస్పెండ్ చేస్తామని తెలిపారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కాగా ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇంతకు ముందు నమోదు చేసి విద్యార్థిని అదృశ్యం కేసుతోనే పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement