ఒకవైపు పెద్ద నోట్ల మార్పిడి నగర వాసులను ముప్పు తిప్పలు పెడుతుండగా, మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్‌లలో చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పెద్ద నోట్ల మార్పిడి నగర వాసులను ముప్పు తిప్పలు పెడుతుండగా, మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్‌లలో చెల్లింపులు చేసే సమయంలో స్వైప్ మిషన్‌లు సైతం పని చేయకపోవడంతో శనివారం వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన హోటళ్లలో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో నగరానికి వచ్చిన పర్యాటకులు, సందర్శకులు ఇబ్బందులకు గురయ్యారు.
కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ఇబ్బంది తలెత్తిందని, వెంటనే పరిష్కరించి యథావిధిగా స్వైప్ మిషన్‌ల ద్వారా బిల్లులు స్వీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పలువురు హోటల్ యజమానులు చెప్పారు. నగరంలోని ఫంక్షన్ హాళ్లలోనూ పాత నోట్లను స్వీకరించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాలకు ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకోదలచిన నగరవాసులు తమ వద్ద అధిక మొత్తంలో కొత్త నోట్లు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది.