బస్సు చార్జీలు పెంచేందుకు కుట్ర: జీవన్ రెడ్డి
కరీంనగర్ (జగిత్యాల): తెలంగాణ ప్రభుత్వం బస్‌చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపేందుకు కుట్రపన్నుతోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం అభినందనీయమైనప్పటికీ సమ్మెకు దిగకముందు ఇస్తే బాగుండేదన్నారు. బస్‌చార్జీలు పెంచే కుట్రలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే వరకు ప్రభుత్వం వేచి చూసిందని, ఫలితంగా ఆర్టీసీకి రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. దీనికి ఆర్టీసీ కార్మికులను దోషులుగా చూపిస్తూ బస్‌చార్జీలు పెంచే ప్రయత్నం మొదలు పెట్టిందని విమర్శించారు.
డీజిల్ ధర ప్రస్తుతం రూ.10 వరకు తగ్గిందని, వ్యాట్, ల్యుబ్రికేషన్ భారం తగ్గించి జనరల్ సేల్స్ టాక్స్‌కు ఎత్తివేస్తే ప్రజలపై భారం మోపాల్సిన అవసరం ఉండదని సూచించారు. ఇటీవల అవసరం లేనప్పటికీ 200 ఏసీ బస్సులను కొనుగోలు చేశారని, వీటిని నడిపేందుకు డ్రైవర్లు సైతం లేరన్నారు.. ప్రభుత్వ విధానాలు, ఉన్నత స్థారుులో అవినీతి, అక్రమాలకే ఆర్టీసీ నష్టాలకు కారణమని తెలిపారు. ప్రస్తుతం పెంచిన ఫిట్‌మెంట్ తాత్కాలికమేనని, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇచ్చినప్పుడే ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 108 సర్వీసుల నిర్వహణను ఆంధ్ర పెట్టుబడిదారు అయిన జీవీకేతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయూలని, ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా 108 సర్వీసులను తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు.