పొత్తులతో.. కిరికిరి తప్పదా? | TDP Alliance With Congress In Telangana | Sakshi
Sakshi News home page

పొత్తులతో.. కిరికిరి తప్పదా?

Sep 9 2018 10:21 AM | Updated on Sep 9 2018 10:21 AM

TDP Alliance With Congress In Telangana - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వలసలతో చిక్కి శల్యమైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీ.టీడీపీ) కాంగ్రెస్‌తో దోస్తీ కోసం స్నేహహస్తం చాస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఉన్న పొత్తునే తిరిగి కొనసాగించాలని సీపీఐ కూడా సిద్ధంగా ఉంది. ఉద్యమకారుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ ఇంటి పార్టీతో  కాంగ్రెస్‌ జతకలవనుందంటున్నారు. ఇక, తెలంగాణ జనసమితికి కాంగ్రెస్‌కు పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో ఇన్ని పార్టీలూ నిజంగానే జతకలిస్తే ఎవరికి ఏయే సీట్లు దక్కుతాయో అన్న చర్చ జోరుగా సాగుతోంది.
 
టీడీపీ ఆరాటం!
తెలంగాణ జిల్లాల్లో టీడీపీని బతికించుకోవాలంటే ఏదో ఒక పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీంతో జిల్లాలో టీడీపీనుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. దాదాపుగా పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయని తేలడం, తెలంగాణ వ్యాప్తంగా కేటాయించే సీట్ల సంఖ్యను బట్టి జిల్లాలో ఒకటో రెండో స్థానాలు తమకు వస్తాయన్న ఆశ పెట్టుకున్నారు. టీడీపీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే పక్షంలో తమ పార్టీ కోదాడ, నకిరేకల్‌ లేదా తుంగతుర్తి, నల్లగొండ స్థానాలను కోరుతుందని అంటున్నారు. అయితే, ఇందులో నకిరేకల్, తుంగతుర్తి మినహా  కోదాడ, నల్లగొండ కాంగ్రెస్‌ సిట్టింగ్‌  స్థానాలు. దీంతో ఆ రెండు స్థానాలపై ఆశ అంతగా పెట్టుకోవడం లేదని, కాకుంటే కోదాడలో తమకే టికెట్‌ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరో వైపు తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి  దక్కుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి టీడీపీ – కాంగ్రెస్‌ పొత్తు వల్ల ఎవరి అవకాశం గల్లంతవుతుందోనన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది.

పొత్తులపై లేని స్పష్టత
వాస్తవానికి కాంగ్రెస్‌తో ఏ పార్టీ జత కలుస్తుందో ఏ పార్టీ నాయకత్వం ఇదమిద్దంగా చెప్పలేకపోతోంది. ఈ చర్చలన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడంతో ఇప్పుడిప్పుడే ఏ పార్టీకి ఏ స్థానం కేటాయిస్తారన్న అంశం కూడా అపరిపక్వ దశలోనే ఉందని అభిప్రాయపడుతున్నారు. కాకుంటే గత ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో పోటీ చేసి దేవరకొండలో విజయం సాధించింది. కాంగ్రెస్‌ తమ సిట్టింగ్‌ స్థానాన్ని త్యాగం చేసి సీపీఐకి కేటాయిస్తే దేవరకొండలో విజయం తర్వాత కొన్నాళ్లకు ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రమావత్‌ రవీంద్రకుమార్‌ టీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. మరోవైపు మునుగోడులో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కక పాల్వాయి స్రవంతి రెబల్‌గా పోటీకి దిగడంతో కాంగ్రెస్‌ మద్దతుతో బరిలోకి దిగిన సీపీఐ ఓడిపోయింది. అయినా, ఈసారి కూడా సీపీఐ కోరే కొన్ని సీట్లతో మునుగోడు కూడా ఒకటిగా ఉంటుందంటున్నారు. ఈసా రి కాంగ్రెస్‌లో టికెట్‌కు గట్టి పోటీ ఉంది.

ఇద్దరు, ముగ్గురు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్‌–సీపీఐ పొత్తు ఫలిస్తుందా లేదన్న అంశం తేలా లేదు. తెలంగాణ ఇంటి పార్టీ కూడా కాంగ్రెస్‌ నాయకత్వంతో మంతనాలు జరుపుతోందని ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ నాయకత్వం నకిరేకల్‌ సీటును గట్టిగా కోరే అవకాశం ఉందంటున్నారు. ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ సతీమణి లక్ష్మి గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడంతో పొత్తు ఉన్నా, లేకున్నా ఈ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరి సీటు కేటాయిస్తే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి పోటీ చేసి ఓడిపోయిన చిరుమర్తి లింగయ్యకు చెక్‌ పడినట్లేనన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. ఇక, తెలంగాణ జనసమితి పొత్తు ఉంటే ఆ పార్టీ మిర్యాలగూడ స్థానాన్ని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌తో ఏయే పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి? ఏ సీట్లు అడుగుతాయి? ఎన్ని దక్కించకుంటాయి? ఎవరి ఆశలు గల్లంతవుతాయి? అన్న ప్రశ్నలకు కొద్ది రోజులు ఆగితే కానీ సమాధానాలు లభించేలా లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement