
నేటి నుంచే ‘దేశం’ మహానాడు
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: మహానాడుకు మొయినాబాద్ మండలంలోని గండిపేట కుటీరం ముస్తాబైంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారపగ్గాలను దక్కించుకున్న టీడీపీ... రెండు రోజుల మహానాడును సంబరంగా నిర్వహిస్తోంది. విజయగర్వంతో ఉన్న ఆ పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లను చేసింది. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న మహానాడు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యే ఈ మహానాడులో పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఉత్సాహంగా ఉన్న రాష్ట్ర నాయకత్వం.. పార్టీ ప్రతినిధులకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఆవరణను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. మంగళ, బుధవారం జరిగే ఈ సమావేశానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లా పార్టీల అధ్యక్షులు, ఇతర కార్యవర్గ ప్రతినిధులు హాజరుకానున్నారు.
పార్టీ ప్రస్థానం, విజయగాథలను వివరిస్తూ ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం, ఇతర సామాజిక సేవలకు సంబంధించి ప్రత్యేక స్టాళ్లను ఆవరణలో ఏర్పాటు చేశారు. మంగళవారం చంద్రబాబునాయుడు ప్రారంభోపన్యాసంతో ప్రారంభమయ్యే మహానాడు.. బుధవారం సాయంత్రం ఆయన ముగింపు ఉపన్యాసంతో ముగియనుంది.