కురుక్షేత్ర సూత్ర దారి శ్రీకృష్ణుడి గురించి గొప్పగా చెప్పుకుంటాం. కృష్ణం వందే జగద్గురం... అంటూ శ్రీకృష్ణభగవానుడిని జగత్తుకంతా గురువుగా భావిస్తాం.
కురుక్షేత్ర సూత్ర దారి శ్రీకృష్ణుడి గురించి గొప్పగా చెప్పుకుంటాం. కృష్ణం వందే జగద్గురం... అంటూ శ్రీకృష్ణభగవానుడిని జగత్తుకంతా గురువుగా భావిస్తాం. కానీ శ్రీకృష్ణుడికి కూడా సాందీపుడు అనే గురువున్న విషయం చాలామందికి తెలియదు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జీవితానికి వెలుగుబాటను ప్రసాదించే గురువు రుణాన్ని శిష్యుడు ఏ రూపంలోనూ తీర్చుకోలేదు. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువుల గురించి ‘సాక్షి’ ఇస్తున్న కథనం...
నవ సమాజ నిర్మాత టీవీ రంగయ్య
షాద్‌నగర్ రూరల్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తిరునగరి వెంకట రంగయ్య (టీవీ రంగయ్య) చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యంతో కష్టపడి చది వారు. చిన్నరంగయ్య, రా ములమ్మల దంపతుల కు మారుడు రంగయ్య. ఎంఏ, బీఈడీ చేసి 1991లో మొదటిసారిగా పెద్దమందడి మండలంలోని పెద్దమునగాల చేడు పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా చేరారు.
1992నుంచి 2002 వరకు కొత్తకోట మండలం విలి యం కొండ పాఠశాలలో పని చేశారు. 2002- 2009 వరకు ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల పరిధిలోని కడియాలకుంట పాఠశాలలో పనిచేశారు. 2009నుంచి ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి పాఠశాలలో పని చేస్తున్నారు. రంగ య్య క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించడంతో పాటు కళారంగంలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేశారు.
సామాజిక సృహ, క్రమశిక్షణ, మానవతా విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే విద్యార్థులు సమాజానికి ఉపయోగపడతారని, ఆ దిశగా విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కళారంగంపై కూడా టీవీ రంగయ్యకు ఎంతో మక్కువ. అందుకే ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూనే ఎన్నో నాటకాలను స్వతహాగా రచించి, విద్యార్థులతో ప్రదర్శింపజేసేవారు. 2012లో హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శించిన ‘అందరూ..అందరే’ నాటిక లో హాస్యపాత్రలో నటించిన రంగయ్య నంది అవార్డు దక్కించుకున్నారు. 2010లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. సాంస్కృతిక శాఖ నుంచి ఉత్తమ విశిష్ట కళాకారుడిగా అవార్డును అందుకున్నారు.
బోధన...పేద విద్యార్థులకు చేయూత
నవాబ్‌పేట: మండల పరిధిలోని ఖానాపూర్ కి చెందిన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. రాములు 1990 డిసెంబర్ 18న ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. 24 ఏళ్లుగా ఆయన మండలంలోనే విద్యాబోధన చేశారు. మొదట సత్రోనిపల్లితండాలో నాలుగేళ్లు, రుక్కంపల్లిలో ఆరేళ్లు, తీగలపల్లిలో ఆరేళ్లు పని చేసిన ఆయన ప్రస్తుతం ఖానాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నారు. గతేడాది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన రాములు విద్యార్థులు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ భాషను సులువుగా నేర్చుకునే బోధిస్తున్నారు.
పిల్లలకు చేతిరాత్ర బాగుండేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి పేరుతో పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులను చేర్పించారు. రెండుసార్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన రాములుకు ఈసారి ఏకంగా రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. అలాగే పాఠశాలల్లో మొక్కలు పెంచడం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గ్రామాల్లో అంటువ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కొంతమంది పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు వారు చదువుకునేందుకు ఎంతో సాయం చేశారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే...
రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో జిల్లాకు చెందిన ఐదుగురికి చోటు దక్కింది. ఇందులో నేషల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కె.రఘురాములు గౌడ్ (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్‌ఎస్ మార్చల, కల్వకుర్తి), ఉత్తమ ఉపాధ్యాయులుగా టీవ రంగయ్య (ఎస్‌జీటీ, పీఎస్ హాజిపల్లి, షాద్‌నగర్), బి.జగదీశ్వర్‌రెడ్డి (గెజిటెడ్ హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ వెలిగొండ, వీపనగండ్ల), టి.నర్సప్ప (స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్‌బీ, ధన్వాడ), శ్రీరాములు (ఎస్‌జీటీ, పీఎస్ ఖానాపూర్, నవాబ్‌పేట)లు ఉన్నారు.
సమాజ హితం... నర్సప్ప అభిమతం
ధన్వాడ: పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చిత్రకళలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు పండిత్ తాటి నర్సప్ప రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. గతంలో పలు పాఠశాలల్లో పని చేసిన ఆయన చిత్రకళల్లో మేటీ అనిపించుకున్నారు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన నర్సప్ప నారాయణపేటలోని తాటి భీమయ్య, చంద్రమ్మ దంపతుల కుమారుడు. 1985 డిసెంబర్ 9న ఇటిక్యాల మండలం ధర్మవరం ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్‌గా ఆయన విధుల్లో చేరారు. 1990-96 వరకు జెడ్పీహెచ్‌ఎస్ అయిజలో, 1996-2000 వరకు మరికల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో, 2000-09 ఊట్కూర్ ఉన్నత పాఠశాలలో, 2009-11 వరకు ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో పదోన్నతి పొంది సీనియర్ తెలుగు పండిత్‌గా ధన్వాడలో విధులు నిర్వహిస్తున్నారు.
చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న తాటిని తండ్రి భీమయ్య వృత్తిపరంగా ప్రోత్సహించారు. ఆయన గీసిన చిత్రాలకు 2002లో బెస్ట్ డ్రాయింగ్ మాస్టర్‌గా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. సమాజ హితంతో పాటు కరువు, వలసలు, చేనేత కార్మికుల దయనీయ పరిస్థితిపై ఎక్కువ చిత్రాలు గీస్తారు. మద్యపానం, సిగరెట్లు, గుట్కా వల్ల జరిగే అనర్థాల గురించి కళారూపంలో వివరించారు. ఒక చిత్రకారుడే కాకుండా కవిగా పలుసార్లు మంత్రులు, అధికారులతో సన్మానాలు పొందారు.
బాధ్యత పెరిగింది...
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడంతో వృత్తిపరంగా, సా మాజికంగా నా బాధ్యత మరింత పెరి గింది. నా విధులు సక్రమంగా నిర్వర్తించి విద్యార్థులకు ఉన్నతమైన సేవ లు అందిస్తాను. ప్రభుత్వ పాఠశాలల ను బలోపేతం చేయడానికి ప్రభుత్వ, ఉపాధ్యాయులపరంగా ఇంకా కృషి జరగాలి. భవిష్యత్‌లో విద్యార్థులను చిత్రకళ, సాహిత్య రంగాల్లో నాకంటే మిన్నగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
- తాటి నర్సప్ప, సీనియర్ తెలుగు పండిత్, జెడ్పీహెచ్‌ఎస్, ధన్వాడ