‘తుంగభద్ర’లో సాంకేతిక సమస్య
- రెండున్నర గంటల పాటు నిలిచిన రైలు
- తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
- దరిదాపుల్లోకి రాని రైల్వే అధికారులు
గద్వాలన్యూటౌన్, న్యూస్‌లైన్: కర్నూలు నుంచి గద్వాల మీదు గా సికింద్రాబాద్‌కు వెళ్లే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో గద్వాల మండలం మేలచెర్వు శివారులో ఆదివారం సాయంత్రం నిలిచిపోయింది. ఇంజన్‌కు మరమ్మతులు చేసేందుకు డ్రైవర్లతో పాటు మెకానిక్‌లు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. రెండున్నర గంటలు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కర్నూలు నుంచి మరో ఇంజన్‌ను తెప్పించడంతో రైలు కదిలింది. ఇంత జరిగినా రైల్వే అధికారులు దరిదాపుల్లోకి రాలేదు.
కర్నూలు నుంచి బయల్దేరిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు గద్వాల రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంజన్‌లో ఓవర్ స్పీడ్ టెంపరేచర్ ట్రిప్ అయ్యి ఒక్కసారిగా గద్వాల పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో మేలచెర్వు శివారులో రైలు ఆగిపోయింది. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు ఇంజన్ వచ్చింది. వెనుక భాగంలో ఇంజన్‌ను అటాచ్ చేసి రైలును కదిలించారు. గద్వాల స్టేషన్‌కు 6 గంటల 50 నిమిషాలకు చేరుకుంది. మరమ్మతులకు గురైన ఇంజన్‌ను మార్చి అటాచ్ చేసిన ఇంజన్‌ను ముందు భాగానికి మార్చి కదిలించారు.
ప్రయాణికుల అవస్థలు...
రెండున్నర గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎండ వేడిమికి తాళలేక అల్లాడిపోయారు. కర్నూలు నుంచి గద్వాలకు వచ్చే ప్రయాణికులు నడుచుకుంటూ గద్వాలకు వెళ్లారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. పిల్లాపాపలతో వచ్చిన వారు మరింత ఇబ్బందులు పడ్డారు.
కనీసం తాగునీరు లేక అల్లాడిపోయారు. సమీపంలోని చేతిపంపును ఆశ్రయిం చారు. అక్కడ కూడా కొద్దిసేపు మాత్రమే నీరు వచ్చి ఆగి పోయింది. విషయం తెలుసుకున్న మేలచెర్వు సర్పంచ్ వేణుగోపాల్‌రెడ్డి ట్యాంకర్‌ను తెప్పించి ప్రయాణికుల దాహార్తిని తీర్చారు. సందట్లో సడేమియాగా రైలులో వాటర్ బాటిళ్లు, టీని విక్రయించే చిరువ్యాపారస్తులు ప్రయాణికులను నిలువునా దోచుకున్నారు. ఇదిలా ఉం టే గద్వాల నుంచి మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన చాలా మంది టికెట్లను వాపసు చేశారు.
పత్తాలేని రైల్వే అధికారులు!
రెండున్నర గంటల పాటు రైలు నిలిచిపోయి నా రైల్వే అధికారులు స్పందించలేదు. ఒక్క అధికారి సైతం సంఘటన స్థలానికి చేరుకోలేదు. అస లు రైలు కదులుతుందా? మరో ఇంజన్ వస్తుందా? అన్న విషయం కూడా తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అక్కడున్న మె కానిక్‌లను కొంత మంది ప్రయాణికులు ప్రశ్నించగా..సరైన సమాధానం రాలేదు. రైల్వే ప్రయాణికుల పట్ల అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని పలువురు ప్రయాణికులు ఆరోపించారు.