
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తనయుడు కార్తీక్
2014 సీన్ రిపీటవుతుందా..? మాజీ మంత్రి సబిత కుటుంబంలో ఈసారి కూడా ఒక్కరే పోటీచేస్తారా..? లేక ఇద్దరూ పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం కల్పిస్తుందా..? ఒకవేళ అనుకున్నది జరగకపోతే పటోళ్ల ఫ్యామిలీ ఆలోచన ఏంటి..? ఇవీ ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలు. కుటుంబం నుంచి ఒక్కరికే పోటీచేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తుందన్న వార్తల నేపథ్యంలో సబిత ఎలాంటి వ్యూహంతో వెళతారనేది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, గతంలో పోటీ చేసిన వారికి మినహాయింపు ఉంటుందని, కొత్త వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. మొత్తంమీద ఏఐసీసీ ఆలోచన జిల్లా కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చకు దారి తీసింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తుండడం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇరకాటంలో పడేస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే నిబంధనతో సబిత పోటీకి దూరమయ్యారు. తాజాగా అదే నిబంధనను అధిష్టానం మరోసారి అమలు చేస్తుందేమోననే ఆందోళన సబిత కుటుంబంలో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సబిత మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా కుటుంబం నుంచి ఒక్కరే పోటీచేయాలని అధిష్టానం చెప్పడంతో ఆమె తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది.
తాను పోటీచేయకుండా తనయుడు కార్తీక్‌ను చేవెళ్ల లోక్‌సభ నుంచి బరిలోకి దించారు. ఇప్పుడు ఇద్దరూ పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నారు. మహేశ్వరం నుంచి సబిత, రాజేంద్రనగర్ నుంచి కార్తీక్‌లు బరిలో నిలవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కొంత కాలంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. కానీ, ఏఐసీసీ నుంచి అందిన తాజా ఖబర్ మళ్లీ సబితను డోలాయమానంలో పడేసింది. అయితే, అధిష్టానం విధించిన నిబంధనల్లోనూ కొన్ని సానుకూలతలు ఉండడం, తల్లీ, తనయులు అడిగే స్థానాల్లో సొంత పార్టీలో పెద్దగా పోటీ లేకపోవడంతో వారు బరిలో నిలిచే అవకాశాలుగా కనిపిస్తున్నాయి.
సుఖాంతమేనా..?
కుటుంబంలో ఒకరికే టికెట్టు ఇవ్వాలనే నిబంధన సబిత ఫ్యామిలీకి వర్తించేలా కనిపించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. అటు మహేశ్వరం.. ఇటు రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయడానికి ఒకరిద్దరూ మినహా చెప్పుకోదగ్గ నేతలు ఆసక్తి చూపడం లేదు. ఇది వీరికి కలిసొచ్చే అంశం. దీనికితోడు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న తరుణంలో ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా సబిత, కార్తీక్ ఇరువురు కూడా సీనియర్లు కావడం.. గతంలో పోటీచేసిన నేపథ్యం ఉండడంతో ఈ షరతుల నుంచి సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.
కేవలం కొత్తవారికి మాత్రమే ఈ నిబంధనను వర్తింపజేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ అధిష్టానం వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఆంక్షలు అమలు చేస్తే మాత్రం సబిత కుటుంబీకులకు ఇబ్బందులు కలగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి అనివార్యమైతే ఈసారి తల్లి కోసం తనయుడు బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతారని తెలిసింది.
గతంలో పోటీచేసిన కుటుంబాలకు కాకుండా కేవలం కొత్తవారికి మాత్రమే ఈ నిబంధన అమలు చేసే అవకాశముంది. తప్పదనుకుంటే అమ్మ కోసం ఈసారి టికెట్‌ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా.
– కార్తీక్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment