బంద్ సక్సెస్ | Telangana bandh success | Sakshi
Sakshi News home page

బంద్ సక్సెస్

May 30 2014 3:20 AM | Updated on Jul 28 2018 6:33 PM

టీఆర్‌ఎస్ పిలుపు మేరకు గురువారం చేపట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో విజయవంతమైంది.

 నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ పిలుపు మేరకు గురువారం చేపట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో విజయవంతమైంది. ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారు. వివిధ కార్మిక సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, టీఆర్‌ఎస్ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు.  ఆర్టీసీ బస్సులు సాయంత్రం 6 గంటల వరకు నడవలేదు. ఆరు డిపోలోని 536 బస్సులు నిలిచిపోవడంతో రీజియన్‌కు రూ. 70 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. వ్యాపారులు, ఇతర సంఘాల నాయకులు బంద్‌లో భాగంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

 జిల్లాకేంద్రంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్త ఆర్టీసీ బస్టాండు ప్రవేశ మార్గం వద్ద ధర్నా చేశారు. తెలంగాణలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని వ్యతిరేకించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాటలకు తలొగ్గి  కేంద్రం మొండిగా వ్యవహరించి ఆర్డినెన్స్ జారీ చేయడం తగదన్నారు. మోడీ తెలంగాణకు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... వెంటనే ఆర్డినెన్స్‌ను వాపస్ తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు కలిసి కేంద్రంతో కుమ్మక్కై ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేయించారన్నారు. కలెక్టరేట్‌లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ చైర్మన్ గైనిగంగారాం మాట్లాడుతూ.. చంద్రబాబు, వెంకయ్య నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.  

 జిల్లాకేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు 100 బైకులతో ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. వేల్పూరు, కమ్మర్‌పల్లి, నిజామాబాద్ మండలం పాల్దా గ్రామాల్లో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎల్లారెడ్డి, మాక్లూర్ మానిక్‌భండార్, ఎడపల్లి మండల కేంద్రంలో, కామారెడ్డి, మోర్తాడ్, పిట్లం, బిచ్కుందలలో రోడ్లపై రాస్తారోకోలు చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.

వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసి ఉంచారు. ఆర్టీసీ  కార్మిక సంఘాలు బంద్‌లో భాగంగా విధులకు వెళ్లలేదు. బస్సులు నడవలేదు. కమ్యూనిస్టు పార్టీలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉద్యోగులు బంద్‌లో భాగంగా నిరసన తెలిపారు.

 కామారెడ్డిలో ఎమ్మెల్యే గంపగోవర్ధన్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, సీపీఐ, సీపీఎం నాయకులు బైక్‌ర్యాలీలో పాల్గొన్నారు.  కామారెడ్డిలోని మున్సిపల్ ఉద్యోగులు కూడా బంద్‌లో పాల్గొని నిరసన తెలిపారు. భిక్కనూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. మాచారెడ్డిలో టీఆర్‌ఎస్ నేతలు ర్యాలీ చేపట్టారు.

ఎల్లారెడ్డి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.  ఆరు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, టీఆర్‌ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో రైల్వేగేటు వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. దీంతో నిజామాబాద్, బోధన్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. రెంజల్, ఎడపల్లి మండల కేంద్రాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

 ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్,సీపీఐ(ఎంఎల్), ఉద్యోగ సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘల నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మాక్లూర్ మండలం మానిక్‌భండార్ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది.

 డిచ్‌పల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 బాన్సువాడలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. పోలవరం డిజైన్ మార్చకుంటే ఉరుకునేది లేదని హెచ్చరించారు. బిచ్కుంద, బీర్కూరు, జుక్కల్, మద్నూరులలో టీఆర్‌ఎస్ నాయకులు బైకు ర్యాలీ తీశారు. ప్రధాన కూడళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. పిట్లం, మద్నూరులలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement