'రాష్ట్రంలో సమస్యలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం'
హైదరాబాద్: రైతులకు భరోసా ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మంగళవారం గవర్నర్ నరసింహన్తో పొన్నాల లక్ష్మయ్యతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. అనంతరం పొన్నాల విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కరెంట్ కోతలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీపై గవర్నర్కు ఈ సందర్భంగా వివరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత రాష్ట్రంలో 250 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు.
సీఎం సొంత జిల్లా సొంత నియోజకవర్గంలోనే ఆత్మహత్యలు జరిగాయని ఆయన వివరించారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలను నివారించడంలో కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని వివరించారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నందున ఏపీ నుంచి తెలంగాణకు రావాలసిన విద్యుత్ అంశంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్ను కోరమని చెప్పారు. అలాగే తెలంగాణలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చోరవ తీసుకునే చూడాలని... విభజన చట్టం ప్రకారం 54 శాతం విద్యుత్ తెలంగాణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేసినట్లు పొన్నాల తెలిపారు.