సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో 2014 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం మరింత పెంచే దిశగా అధికారయంత్రాంగం చర్యలు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికా రి సర్ఫరాజ్ అహ్మద్ ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వివరాలపై ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లోని అసౌకర్యాలతోపాటు ఆ కేంద్రాలకు వచ్చే ఓటర్ల ఇబ్బందులను తెలుసుకోవాలని ఆయన అధికారగణాన్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తగు చర్యలు తీసుకునే అవకాశముంటుందని అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో సూచించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించి ఏర్పాట్లను పరిశీలిస్తోంది.
2014 ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటర్లు.. సగటున 72.47 శాతం పోలింగ్..
2014 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సవరణ, నమో దు తర్వాత ఇటీవల ప్రకటించిన జాబితా ప్రకారం 42,305 ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల పో లింగ్ నాటికి 9,32,534 ఓటర్లుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 8,90,229గా ఉంది. ఆ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో సగటున 72.47 శా తం నమోదు కాగా, అత్యధికంగా మానకొండూ రు నియోజకవర్గం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అత్యల్పంగా పోలింగ్ శా తం కరీంనగర్‌లో నమోదైంది. కరీంనగర్ నియోజకవర్గంలో 3,22,595 మంది ఓటర్లుంటే 1,89,580 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా 58.77 శాతంగా నమోదైంది. హుజూ రాబాద్‌లో 2,09,783కు 1,62,675 మంది ఓటు వేయగా 77.54 శాతం, చొప్పదండి(ఎస్సీ)లో 2,04,776లకు 1,50,049 మంది ఓట్లేయగా 73.27 శాతంగా నమోదైంది.
అదేవిధంగా మానకొండూరు(ఎస్సీ) నియోజకవర్గంలో 1,95,380 ఓటర్లకు గాను 1,56,907 మంది తమ ఓటుహక్కుని వినియోగించుకోగా 80.31 శాతంగా పో లింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఓటర్ల సంఖ్య తగ్గినా.. పోలింగ్ శాతం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్ల ఓటర్లనే జిల్లా ఓటర్లుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యింది. అక్కడి సౌకర్యాల విషయంలోనూ సమగ్ర సమాచారాన్ని అధికారయంత్రాంగం సేకరించింది. ఈ క్రమంలో ఇటీవల కొత్తగా అన్ని మండలాలకు తహసీల్దార్లు విధుల్లో చేరారు. కిందటి ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడాన్ని గమనించిన పాలనాధికారి మరోమారు పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని వారిని ఆదేశించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
కరీంనగర్‌లోనే మరీ తక్కువ.. పోలింగ్ శాతంపై కసరత్తు..
నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తే గత ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈ నియోజకవర్గంలో 3,22,595 మంది ఓటర్లుంటే 1,89,580 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నా రు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే చాలా తక్కువగా 58.77 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. హుజూరాబాద్, చొప్పదండిలో ఫరవాలేదనిపించినా.. మానకొండూరులో అత్యధికంగా 80.31 శాతం నమోదైంది. ఈసారి నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం మరింత పెంచే దిశగా ఎదురయ్యే అవరోధాలను అధిగమించాలని పాలనాధికారి భావిస్తున్నారు. అవసరమైతే పోలింగ్ కేంద్రాన్ని ఒక చోటు నుంచి దగ్గరగా ఉన్న మరో చోటికి మార్చడం లేదంటే గుర్తించిన పోలింగ్ కేంద్రానికి రాని పరిస్థితి ఉంటే ఏం చేయాలన్న దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికా రులను ఆదేశించడం చూస్తుంటే పాలనాధికారి పోలింగ్ నమోదుపై పక్కా ప్రణాళికతో వెళ్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా కొత్తగా వచ్చిన తహసీల్దార్లు సరైన నివేదికను, ప్రతిపాదనలు సరిగ్గా రూపొందిస్తేనే పాలనాధికారి సంకల్పం నెరవేరే అవకాశముంది. కాగా.. ఇటీవల ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో 8,90,229 మంది ఓటర్లుండగా ఇందులో 4,42,342 పురుషులు, 4,46,832 మహిళా ఓటర్లు, 55 మంది ఇతరులు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే కరీంనగర్‌లో అత్యధికంగా మొత్తం ఓటర్లు 2,77,236 ఉండగా, అత్యల్పంగా 1,99,098 మంది మానకొండూరులో ఉన్నారు. చొప్పదండిలో 2,08,056, హుజూరాబాద్‌లో 2,05,839 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. పోలింగ్ నాటికి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నా.. ఇప్పుడున్న జాబితా ఆధారంగా పోలింగ్ శాతం పెంచడంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment