సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదలై వచ్చే నవంబర్‌లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని భావించిన నేతలు తాజా ప్రకటనతో ఒక్కసారిగా కంగుతిన్నారు. వచ్చేనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా సరిగ్గా రెండు నెలలకు డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్‌తోపాటే నామినేషన్ల ప్రక్రియ మొదలై వారం రోజులపాటు సాగుతుంది. అనంతరం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల ప్రక్రియ నవంబర్ 22 వరకు పూర్తవుతుంది.
అక్కడి నుంచి సరిగ్గా 15 రోజులకు... అంటే డిసెంబర్ 7న పోలింగ్ జరిగి 11న ఫలితాలు వెలువడుతాయి. ఈ లెక్కన మొత్తంగా రెండు నెలలపాటు ఎన్నికల వాతావరణంగా వాడీవేడి ఉండబోతోంది. షెడ్యూలుకు పోలింగ్‌నకు మధ్య వ్యవధి రెండు నెలలు ఉండడం వల్ల అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడవుతుందని నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఖరారైన టీఆర్‌ఎస్ అభ్యర్థులతోపాటు ఖరారు కాని కాంగ్రెస్ కూటమి, బీజేపీ, ఇతర పక్షాల నాయకులు కూడా రెండు నెలలు ఎలా ‘భరించాలో’అని ఆందోళన చెందుతున్నారు.
అధికార పార్టీ భ్యర్థులకు బోలెడు ఖర్చు
నెల రోజుల క్రితం సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసి, 105 మంది అభ్యర్థులను కూడా టీఆర్‌ఎస్ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆ రోజే ప్రకటించబడ్డారు. గడిచిన నెల రోజులుగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి ప్రజల వద్దకు వెళుతుండగా, మరికొందరు అభ్యర్థులు ఇతర పార్టీల్లో ఉన్న పేరున్న నాయకులను గులాబీ గూటికి తెచ్చుకునే పనిలో ఉన్నారు.
మరికొందరు మాత్రం అసంతృప్తి నేతలను మచ్చిక చేసుకోవడం, కలిసి రావాలని ప్రాధేయపడుతూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలోనే కాలం గడిపారు. నెలరోజులపాటు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా అన్నీ ‘భరిస్తూ’ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీని డిసెంబర్ 7గా ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో కంగుతిన్నారు. ఈ రెండు నెలలపాటు నియోజకవర్గాల్లో పాదయాత్రలు, పర్యటనలు, అసంతృప్తులను బుజ్జగించడం వంటి కార్యక్రమాలకు తడిసి మోపెడవుతుందని ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలపాటు గడువు ఉండడంతో ఆయా మండలాల్లో ప్రభావితం చూపే నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఎగరేసుకుపోతారేమో అనే భయం కూడా పట్టుకొంది.
కూటమి లెక్క ఎప్పటికి తేలేనో..?
మహాకూటమిగా ఏర్పాటైన కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐల మధ్య సీట్ల లెక్క నెలరోజులైనా... ఇప్పటి వరకు తేలలేదు. టీడీపీ, టీజేఎస్, సీపీఐ తాము పోటీ చేసే స్థానాల వివరాలను ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాయి. మిత్రులు అడిగిన లెక్కకు, కాంగ్రెస్ ఇస్తామంటున్న సీట్లకు పొంతన కుదరలేదు. మధ్యేమార్గంగా ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా నెలరోజుల గడువు ఉన్న నేపథ్యంలో తొందరపడాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో టీఆర్‌ఎస్సేతర పార్టీల్లో కూడా టెన్షన్ మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల, బెల్లంపల్లి సీట్ల కోసం మిత్రపక్షాలు పట్టు పట్టే అవకాశం ఉండడంతో ఇక్కడ పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు మరికొన్ని రోజులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తింది.
కాంగ్రెస్ తరువాతే బీజేపీ అభ్యర్థులు...
నామినేషన్లు దాఖలు చేసేందుకు నోటిఫికేష్ వెలువడిన నాటి నుంచి ఆఖరు తేది నవంబర్ 19 వరకు గడువు ఉంది. రాష్ట్రంలో నామినేషన్లకు చివరి రోజు కూడా అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూటమి పోటీ చేసే సీట్ల సంగతి తేలిన తరువాత అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. నెలరోజుల గడువు దొరకడంతో అభ్యర్థుల ప్రకటన అంత తొందరగా జరగకపోవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల సంఖ్య తేలిన తరువాత తొలి విడతగా కొందరు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. నోటిఫికేషన్‌కు ముందు మిగతా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి వెళతారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తరువాతే బీజేపీ జాబితా విడుదలవుతుందని సమాచారం. ఈ పరిణామ క్రమంలో రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటనకు మరికొంత సమయం పడుతుంది.
టీఆర్‌ఎస్‌కు పోటీగా కాంగ్రెస్, బీజేపీ ప్రచారం
నెలరోజుల క్రితం టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉంటామనే నమ్మకం ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా పోటాపోటీగా ప్రచారం ప్రారంభించాయి. మంచిర్యాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుకు దీటుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సబ్ కమిటీ చైర్మన్ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు శనివారం నుంచి ప్రచారం ప్రారంభించారు. బీజేపీ తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ఇప్పటికే బైక్‌ర్యాలీతో ప్రచారం ప్రారంభించారు.
సిర్పూరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప అధికారికంగా ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ తరఫున ఇటీవల పార్టీలో చేరిన పాల్వాయి హరీష్‌బాబు గత కొన్నినెలలుగా తన ప్రచారం నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యర్థులుగానే ప్రచారం సాగిస్తున్నారు. అధికార పార్టీ తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. ఇక చెన్నూరులో అధికార పార్టీ అభ్యర్థి, ఎంపీ బాల్క సుమన్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరు అనేది తేలకపోయినా.. గ్రూప్–1 మాజీ అధికారి బోర్లకుంట వెంకటేష్ నేత తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ నుంచి రేఖానాయక్, కాంగ్రెస్ తరఫున రమేష్ రాథోడ్ తమకు పట్టున్న ప్రాంతాల్లో ప్రచారం సాగిస్తున్నారు. ముథోల్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల తరఫున విఠల్‌రెడ్డి, రామారావు పటేల్ పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ నేతలెవరూ ప్రజల వద్దకు వెళ్లడం లేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొయ్యల ఏమాజీ టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు పోటీగా ప్రచారం సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment