ఆదిలాబాద్ క్రైం : మీ పోలీసులు ఎలా ఉండాలనుకుంటున్నారు..? పోలీసు వ్యవస్థలో మార్పులు చేసే అంశాలేవి..? మీకు కావాల్సిన రక్షణ వ్యవస్థను ఎంచుకోండి.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి, మీ అమూల్యమైన సలహాలు, సూచనలతో ‘ఫ్రెండ్లీ పోలీస్’ వ్యవస్థను రూపొందించే దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తోంది.
పోలీసు వ్యవస్థను మార్చి నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేలా పలు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10లోగా ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి పూర్తి నివేదిక అందజేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. కాగా.. ఇటీవ ల పలు మండలాల్లోని పోలీసు స్టేషన్‌లు, జిల్లా కేం ద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు ఏర్పాటు చేశారు.
అయితే.. దుర్గా నవరాత్రులు, దసరా, బక్రీద్ పండుగలు వరుసగా రావడంతో ప్రజాభిప్రాయ సేకరణ ఆలస్యమైంది. నేటితో పండుగలన్నీ పూర్తవుతుండడంతో జిల్లా పోలీసు శాఖ ఠాణా మొదలుకొని సబ్‌డివిజన్‌స్థాయి దాకా సమావేశాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని ఈనెల 10 లోగా ప్రభుత్వానికి నివే దించనున్నారు.
సామాన్యుడు సైతం సమస్య చెప్పుకునేలా..
గతంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ భయపడేవారు. స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు ఏమంటారోననే భయం ఉండేది. ఈ భయం నుంచి సామాన్యుడిని విముక్తి చే సి.. నిర్భయంగా పోలీసు మెట్లెక్కేలా చేయాలని భావిస్తోంది సర్కారు. ఇందులో భాగంగానే పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో కాలం చెల్లిన చట్టాలను, ప్రజల అవసరాలు తీర్చలేని పోలీసులను మార్చేందుకు సిద్ధమవుతోంది.
నూతన పోలీసు వ్యవస్థ రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేసి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలకనుగుణంగా నూతన పోలీసు వ్యవస్థను రూపొందించనున్నారు. ఈ మేరకు ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 50 శాతం ప్రజాభిప్రాయ సేకరణ అయినట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను ప్రభుత్వానికి అందజేసేందుకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పోలీసులు ప్రణాళికను రూపొందించారు.
మంగళవారం నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఐదు రోజులపాటు ప్రజాభిప్రాయాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు లేదా మూడు సమావేశాలు నిర్వహించి.. అందులో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంశాల వారీగా సూచనలు, సలహాలు అక్కడే నమోదు చేసుకుని జిల్లా స్థాయి అధికారులకు పంపించనున్నారు.
ఆధునికీకరణలో ప్రజలే భాగస్వాములు..
పోలీసులను ఫ్రెండ్లీ అండ్ మాడ్రన్ (స్నేహ పూర్వక, అధునాతన)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీసు వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇలాగే ప్రతి జిల్లాలోనూ పోలీసు వ్యవస్థను ఆధునికీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు రంగంలోకి దిగిన డీజీపీ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందుకోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించి ప్రజల నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ప్రజలతో పాటు, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, మహిళా సంఘాలు, ఎన్‌జీవోలు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులను భాగస్వాములుగా చేసి, వారి నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
ఫ్రెండ్లీ పోలీస్
Published Mon, Oct 6 2014 1:53 AM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM
Advertisement