సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనా నుంచి తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించేందుకు పలు బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. చైనా నుంచి వెనక్కి మళ్లుతున్న కంపెనీలను ఆకర్షించేందుకు మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక మౌలిక వసతుల పరంగా ముందంజలో ఉన్న తెలంగాణకు ఈ కంపెనీలను రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజెస్, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల ని ప్రభుత్వం నిర్ణయించింది.
చైనాపై ఆధారపడుతున్న భారత్...
చైనా నుంచి 75% మేర వైద్య ఉపకరణాలు, 40% ఫార్మా రంగానికి సంబంధించిన ముడి పదార్థాలు, టెక్స్‌టైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటోం ది. ఔషధాల ఉత్పత్తిపరంగా ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉన్నా, వాటి తయారీలో అవసరమయ్యే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ), ఇంటర్మీడియేట్ల కోసం చైనాపై ఆధారపడుతోంది. కరోనా సంక్షోభం మూలంగా ఏపీఐ ధరల పెరుగుదల, రవాణా లో జాప్యంతో ఔషధ డిమాండ్‌కు అనుగుణం గా ఫార్మా రంగం ఉత్పత్తి చేయలేకపోతోంది.
దేశీయంగానే ముడిపదార్థాల తయారీ...
ఔషధాల ఉత్పత్తిలో అవసరమయ్యే ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయంగా బల్క్ డ్రగ్ తయారీని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఔషధ తయారీ రంగానికి చిరునామాగా ఉన్న తెలంగాణ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశీయ ఔషధ తయారీ పరిశ్రమకు అవసరమైన ఏపీఐ, ఇంటర్మీడియేట్ల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల తయారీకి హైదరాబాద్‌కు చెందిన సమీకృత ఔషధ తయారీ కంపెనీ లక్సాయ్ లైఫ్‌సైన్సెస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) నడుమ కుదిరిన తాజా ఒప్పందం రాష్ట్రం అనుసరించే భవిష్యత్ వ్యూహానికి అద్దం పడుతోంది.
మౌలిక వసతులపై దృష్టి...
హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైజెస్ పార్కు, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు తదితర పారిశ్రామిక మౌలిక వసతులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయి. చైనా నుంచి వెనక్కి మళ్లుతున్న కంపెనీలను భారత్‌కు రప్పించేందుకు జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న ఇండస్ట్రియల్ క్లస్టర్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. తొలి విడతలో హైదరాబాద్–వరంగల్‌తో పాటు మరో రెండు ఇండస్ట్రియల్ క్లస్టర్లలో మౌలిక వసతులపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Comments
Please login to add a commentAdd a comment