జనాభా ప్రాతిపదికన బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులలోని ఆయా కులాల్లో జనాభాను బట్టి బీసీ సహకార ఫెడరేషన్లకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు జరుపనుంది. గతేడాది ఆగస్టు 19న సమగ్ర కుటుంబసర్వేలో ఆయా బీసీ కులాలకు సంబంధించి లెక్కలకు అనుగుణంగా ఆయా ఫెడరేషన్లకు 2015-16 బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన సమాచారం ప్రకారం రాష్ర్టంలో విశ్వబ్రాహ్మణ, అనుబంధకులాలు కలుపుకుని 9.5 లక్షల మంది, రజకుల సంఖ్య 8.5 లక్షలుగా తేలింది.
ఇక ఇతర వెనుకబడిన కులాల వివరాల విషయానికి వస్తే వడ్డెరలు 3.75 లక్షలు, కుమ్మరి, శాలివాహన 3.70 లక్షలు, నాయి బ్రాహ్మణులు 3 లక్షలు, వాల్మీకి/బోయలు దాదాపు 3 లక్షలు, సగర (ఉప్పర) 1.20 లక్షలు, మేదర 91 వేలు, కృష్ణ బలిజ/పూసల 38 వేలు, భట్రాజ్‌లు 17 వేలు ఉన్నట్టు స్పష్టమైంది. ఈ పది కులాలకు సంబంధించిన సహకార ఫెడరేషన్లకు వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులపై గతంలోనే కొంత కసరత్తు జరిగింది.
ఆయా ఫెడరేషన్లకు బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపు సిద్ధం చేశారు. అయితే ఆ తర్వాత సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన వివరాలకు అనుగుణంగా ఆయా కులాల లెక్కలు తీసి బడ్జెట్ ప్రతిపాదలను తాజాగా రూపొందించారు. మొత్తంగా చూస్తే ఈ కులాలకు సంబంధించిన పది సహకార ఫెడరేషన్లకు దాదాపు రూ.160-170 కోట్ల వర కు ప్రతిపాదించి ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. ఆయా శాఖలవారీగా బడ్జెట్ కసరత్తు ముగిశాక, ఈ ప్రతిపాదనలకు కూడా తుదిరూపం ఇచ్చి వార్షిక బడ్జెట్‌లో పెట్టనున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం.