మున్సి‘పోల్స్‌’కు లైన్‌ క్లియర్‌ | Telangana High Court Clears Municipal Elections PIL | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్‌’కు లైన్‌ క్లియర్‌

Published Wed, Oct 23 2019 2:09 AM | Last Updated on Wed, Oct 23 2019 8:33 AM

Telangana High Court Clears Municipal Elections PIL - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వ హణ విషయంలో నెలకొన్న న్యాయ పరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్ని కలకు అవసరమైన ముందస్తు ప్రక్రి యను ప్రభుత్వం చట్ట ప్రకారం చేయ లేదంటూ దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాల (పిల్స్‌)ను హైకోర్టు ధర్మాస నం మంగళవారం తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని 243–జెడ్‌ ప్రకారం ఎన్నికల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు విని యోగించిన ఓటర్ల జాబితా ఆధారంగా మున్సిపల్‌ ఎన్నికలకు అవసర మైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన చేయొచ్చని తేల్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. తీర్పు వెలు వడిన వెంటనే అదనపు అడ్వొ కేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు కల్పించుకొని పలు మున్సిపాలిటీలకు సంబంధించిన కేసులు సింగిల్‌ జడ్జి వద్ద పెండిం గ్‌లో ఉన్నాయని, కొన్నింటిలో స్టే ఆదేశాలు వెలువడ్డా యని, వాటి విషయంలోనూ జోక్యం చేసుకొని ఎన్ని కల నిర్వహణకు వీలుగా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ వాటన్నింటినీ సింగిల్‌ జడ్జి వద్దే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. 

కేవలం ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేం..
‘‘అసెంబ్లీకి వినియోగించిన ఓటర్ల జాబితా ఆధారంగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించొచ్చని మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌–11 స్పష్టం చేస్తోంది. జూలై 3న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు వెలువరించిన నోటిఫికేషన్‌ను పిటిషనర్లు సవాల్‌ చేయడం సరికాదు. సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల మేరకు వాటి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు వీల్లేదు. అందుకే పిల్స్‌ను కొట్టేస్తున్నాం. ఈ దశలో ఎన్నికలకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని ఆధారాలు లేకుండా పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్‌ జడ్జి మున్సిపల్‌ ఎన్నికలపై వెలువరించిన తీర్పులో ఎన్నికలకు గరిష్టంగా అవసరమైన రోజులు ఉండాలనే అంశాన్ని మాత్రమే తెలిపింది. ఆ ప్రక్రియ పూర్తికి కనీస సమయం ఎంత ఉండాలో ఎక్కడా లేదు. ఈ విషయంలో సందేహాలు అవసరం లేదు.

అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన చేయడం సులభం. ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా చేయడం మరింత సులభం. ఆ కేటగిరీల ఓటర్ల గణనలో తప్పులు జరిగాయని పిటిషనర్లు ఎలాంటి ఆధారాల్ని చూపలేకపోయారు. ఆరోపణల ఆధారంగానే కోర్టుకు వచ్చారు. ఓటరు గణన తప్పుగా జరిగిందంటూ ఒక్క ఓటరు కూడా కోర్టుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్లు చేసిన ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకోలేం. ఓటర్ల జాబితాలో లోపాలున్నాయనే ఆరోపణ సరికాదు. ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కావాల్సినంత సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది జూలై 3న ఓటర్ల జాబితా సిద్ధం కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేయడం చెల్లదు. రాజ్యాంగంలోని 243–జెడ్‌ ప్రకారం ఐదేళ్ల గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి’’అని హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. 

స్టే ఉత్తర్వుల అడ్డంకి తొలగితేనే..
ఈ వ్యాజ్యాలపై విచారణ సమయంలో స్టే ఉత్తర్వులు జారీ చేయని ధర్మాసనం... వాదనలు ముగిసన ఈ నెల 1న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరించరాదని మధ్యంతర ఆదేశాలిచ్చింది. పిల్స్‌పై ధర్మాసనం 27 రోజులపాటు విచారణ జరిపింది. తాజా తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ఉన్న న్యాయపర అడ్డంకులు తొలగిపోయాయి. అయితే 75 మున్సిపాలిటీలపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వుల తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్తిస్తే గడువు ముగిసిన 121 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లతోపాటు ఇంకా గడువు ఉన్న పది కార్పొరేషన్లకు (హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌ మినహా) ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement