జానకీరామ్ దుర్మరణానికి ఇవే కారణాలు | Telugu producer Nandamuri Janakiram dies in a fatal car accident | Sakshi
Sakshi News home page

జానకీరామ్ దుర్మరణానికి ఇవే కారణాలు

Published Sun, Dec 7 2014 5:27 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

జానకీరామ్ దుర్మరణానికి ఇవే కారణాలు - Sakshi

జానకీరామ్ దుర్మరణానికి ఇవే కారణాలు

రాంగ్‌రూట్..అతివేగం..
 మునగాల మండలం ఆకుపాముల శివారులో ఘటన

 ట్రాక్టర్ డ్రైవర్ రాంగ్‌రూట్ డ్రైవింగ్..కారు అతి వేగం.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయని హైవే అధికారులు.. ఇన్ని తప్పుల ఫలితం ఓ నిండుప్రాణం.. ఆ కుటుంబానికి తీరని శోకం.. మునగాల మండల పరిధిలోని ఆకుపాముల శివారులో 65వ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు, సినీనిర్మాత నందమూరి జానకీరామ్(38) దుర్మరణం పాలయ్యాడు.
 
 మునగాల/కోదాడటౌన్ : జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగం, ట్రాక్టర్‌డ్రైవర్ రాంగ్‌రూట్ డ్రైవింగ్ ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.  ఈ ప్రమాదంలో టీడీపీ నేత నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నిర్మాత నందమూరి జానకీరామ్ తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. జాతీయ రహదారిపై ఆకుపాముల  శివారులో బైపాస్ రోడ్డులో గ్రామంలోకి వెళ్లేందుకు క్రాసింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. రహదారికి ఇరువైపులా దాదాపు 100 నుంచి 120కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రాంతంలో తరచు వాహనాలు రాంగ్‌రూట్‌లో క్రాసింగ్ చేస్తూ జాతీయ రహదారిపైకి వస్తుంటాయి. ఈ తరుణంలో ఆదమరిస్తే ప్రమాదం జరగక మానదు.

గతంలో ఇదే ప్రాంతంలో రోడ్డును క్రాసింగ్ చేస్తుండగా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆరు నెలల కాలంలో ముగ్గురు ద్విచక్ర వాహనదారులు మృతిచెందారు. రెండు నెలల క్రితం రాత్రి వేళ పొలం వద్దకు వెళుతున్న ఓ రైతు రోడ్డు క్రాస్ చేస్తూ లారీ ఢీకొని మృతిచెందాడు. ఇప్పుడు జానకీరామ్ ప్రయాణిస్తున్న టాటా సఫారీ ప్రమాదానికి గురైంది. రోజుకో ప్రమాదం జరుగుతున్నా నేషనల్ హైవే అధికారులు, అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఈ ప్రాంతంలో ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక బోర్డులు గానీ, సిగ్నల్ లైట్లు కానీ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు కొంతమేరకు నివారించవచ్చు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మున్ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement