‘వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యాన్ని చేరుకోండి. మా కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలో జరగొద్దని కోరుకుంటున్నా. వేడుక ముగిసిన వెంటనే క్షేమంగా ఇంటికి చేరుకోండి.. మీ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోండి’ సోదరుడు జానకిరాం మరణం తర్వాత రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే క్రమంలో భాగంగా తన సినిమా ప్రారంభంలో, పలు సందర్భాల్లో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేప్పే మాటలివీ.
సాక్షి, హైదరాబాద్/మునగాల (నల్లగొండ): దురదృష్టవశాత్తు మళ్లీ అదే ఘోరం జరిగిపోయింది. నందమూరి జానకిరాం చనిపోయిన నల్లగొండ జిల్లాలోనే హీరో హరికృష్ణ కూడా మృత్యువాత పడ్డారు. అవసరం, దానికి తోడు తొందరపాటులో రెట్టించిన వేగంతో నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది. సామాన్యులు మొదలుకొని సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు దూకుడుతో ప్రయాణించడంతో ప్రమాదాల బారినపడుతున్నారు. కేంద్ర మాజీమంత్రి ఎర్రన్నాయుడు, మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి, దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, సినీ నటుడు భరత్, ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ తదితరులు రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా తనువు చాలించారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు..
గతేడాది జూన్‌లో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్.. శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని తేలింది. అంతకు ముందు నెలలో బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నితీశ్ మృత్యువాతపడ్డాడు. అత్యంత వేగంతో వాహనాన్ని నడుపుతూ పెద్దమ్మగుడి సమీపంలోని మెట్రోపిల్లర్‌కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- 2014 ఏప్రిల్‌లో ప్రముఖ రాజకీయ నేత భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృత్యువాత పడ్డారు.
- 2013 ఆగస్టులో మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత లాల్‌జాన్‌బాషా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు.
నల్లగొండ–గుంటూరు రోడ్డులో అతివేగంతో వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అంతకుముందు ఏడాది నవంబర్‌లో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఠి 2011 డిసెంబర్‌లో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనయుడు ప్రతీక్‌రెడ్డి పటాన్‌చెరు దగ్గర ఓఆర్‌ఆర్‌పై కారు ప్రమాదంలో చనిపోయాడు. అంతకు రెండు నెలల ముందు క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ బైకుపై వెళ్తూ అతివేగంతో అదుపుతప్పి తీవ్రగాయాలపాలయ్యాడు. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు.
- 2010 జూన్‌లో సినీనటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. 2003 అక్టోబర్‌లో సినీ నటుడు బాబుమోహన్ కుమారుడు పవన్‌కుమార్ బైక్‌పై వెళ్తూ జూబ్లీహిల్స్‌లో డివైడర్‌ను ఢీ కొట్టి చనిపోయాడు.
- 2000 ఏప్రిల్‌లో మాజీ హోంమంత్రి పట్లోల్ల ఇంద్రారెడ్డి మహబూబ్‌నగర్‌లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనం అదుపుతప్పడంతో అక్కడికక్కడే మరణించారు.
నాడు తనయుడు.. నేడు తండ్రి
నల్లగొండ జిల్లా మునగాల వద్ద 2014 డిసెంబర్ 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరాం మరణించాడు. అతివేగంతో వెళ్తున్న సఫారీ వాహనానికి ట్రాక్టర్ అడ్డురావడంతో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ ట్రాలీని జానకిరాం కారు ఢీకొట్టింది. ముందు సీటులో ఉన్న జానకిరాంకు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఇప్పుడు తండ్రి హరికృష్ణ కూడా నల్లగొండ– అద్దంకి రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాగా, తొమ్మిదేళ్ల కింద సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. మోతె మండల కేంద్రం సమీపంలోని తిరుపతమ్మగుడి మూలమలుపు వద్ద సూర్యాపేట–ఖమ్మం ప్రధాన రహదారిపై 2009 మార్చి 26 అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ వాహనం బోల్తాపడింది. ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగం, అజాగ్రత్తగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment