ప్రతీకాత్మక చిత్రం
రామయాయంపేట ప్రాంతంలో చిరుతలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి బారిన పడి ఇప్పటివరకు మండల పరిధిలోని పలు గ్రామాల్లో 30 వరకు దూడలతోపాటు మేకలు హతమయ్యాయి. మండల పరిధిలో దాదాపు ఏదోఒక చోట ప్రతిరోజూ చిరుత దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
రామాయంపేట(మెదక్): జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో 13 వరకు చిరుతలున్నాయి. వీటిలో రామాయంపేట మండల పరిధిలోనే ఏడుకు పైగా ఉన్నట్లు తెలుస్తున్నా ఆ శాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా బయట పెట్టడం లేదు. చిరుతల బెడదతో రాత్రివేళ రైతులు పంటచేను కాపలాకు వెళ్లడానికి జంకుతున్నారు. అక్కన్నపేట, తొనిగండ్ల, లక్ష్మాపూర్, ఝాన్సిలింగాపూర్, కాట్రియాల, ప్రగతిధర్మారం, పర్వతాపూర్, దంతేపల్లి పరి«ధిలో దట్టమైన అటవీప్రాంతం ఉంది. ఈ అడవిలో చిరుతులు, ఎలుగుబంట్లు, నీల్‌గాయిలు, రేసు కుక్కలతోపాటు వేల సంఖ్యలో వివిధ రకాల జీవరాశులున్నాయి.
ఈ అటవీప్రాంతంలో 13 వరకు చిరుతలున్నట్లు ఇటీవల నిర్వహించిన జంతుగణనలో తేల్చారు. కాట్రియాల, దంతేపల్లి, పర్వతాపూర్, గ్రామాలను మెదక్ అటవీశాఖ పరిధిలో చేర్చగా, మిగతా గ్రామాలు మండల అటవీ రేంజీ పరిధిలోనే ఉన్నాయి. రెండు, మూడు నెలల కాలంగా చిరుతలు దాడిలో పదుల సంఖ్యలో దూడలతోపాటు మేకలు, పశువులు హతమవుతున్నాయి. తొనిగండ్ల గ్రామంలో అత్యధికంగా ఎనిమిది దూడలతోపాటు మూడు మేకలను చిరుతలు హతమార్చాయి.
రాత్రి వేళ బయటకు వెళ్లొద్దని దండోరా..
కాగా ఇటీవల చిరుతల దాడులు పెరిగిపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ అడవి పందులు, దుప్పిలు పంట చేన్లను ధ్వంసం చేస్తుండటంతో రైతులు ప్రతిరోజూ రాత్రివేళ చేన్ల కాపలాకు వెళ్తుంటారు. రెండు మూడు నెలల కాలంగా చిరుతల దాడులతో రైతులు చేన్ల కాపలాకు కూడా వెళ్లడం మానుకున్నారు. దీంతో పంట చేన్లు అడవి పందులు, దుప్పులు ధ్వంసం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రాత్రివేళల్లో పంటచేను కాపలాకు వెళ్లవద్దని ఈమేరకు గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు.
బోన్లకు చిక్కని చిరుతలు
పశువులు, మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తున్న చిరుతలను బంధించడానికిగాను అటవీశాఖ అధికారులు 15 రోజుల క్రితం ఝాన్సిలింగాపూర్, తొనిగండ్ల అటవీ ప్రాంతంలో రెండు బోన్లను ఏర్పాటు చేసి కుక్కలను ఎరగా పెట్టారు. అయినా చిరుతలు మాత్రం చిక్కలేదు. వాటిని బంధించడానికిగాను మరిన్ని బోన్లు అవసరం కాగా, ఆ దిశగా ఆశాఖ అ«ధికారులు నిర్ణయించారు.
చిరుతదాడిలో చనిపోయిన లేగదూడ
కుక్కను ఎరగా ఏర్పాటు చేసిన బోను
కాగా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బోర్లవద్దకు తాగునీటికోసం వస్తున్న చిరుతలను చూస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా చిరుతలను బందించి తమకు రక్షణ కల్పించాలని వారు పలుమార్లు అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. చిరుతల దాడిలో మృతిచెందిన అన్ని పశువులు, మేకలకు నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.
జీవాలను అడవికి తీసుకెళ్తలేం..
అడవిల పులి తిరుగుతుందనే భయంతో జీవాలను మేతకు అడవిలోకి తీసుకెళ్తలేం. ఇప్పటికే చాలా జీవాలను పులులు చంపినయి. మేతకోసం జీవాలను మన్నెం తరలించినం. ఇక్కడ ఉంచితే ఏం లాభం లేదు. 15 రోజుల కిందట అడవిలో మేతకు వెళ్లిన మందలోనుంచి ఒక మేకను పులి ఎత్తుకపోతుండగా, కాపరి పులిని వెంబడిస్తూ కిందపడి గాయాలపాలయ్యాడు.
– భీరయ్య, మేకల కాపరి,తొనిగండ్ల
బంధించడానికి ప్రయత్నిస్తున్నాం.
తరచూ పశువులపై దాడులకు పాల్పడుతున్న చిరుతలను బంధించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ మేరకు రామాయంపేట పరిధిలో రెండు బోన్లను ఏర్పాటు చేసినా అవి చిక్కలేదు. మరిన్ని బోన్లను ఏర్పాటు చేస్తాం. బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయడానికి కృషి చేస్తున్నాం. ఈమేరకు కొందరికి నష్టపరిహారం ఇప్పడికే అందించాం. రాత్రి వేళల్లో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
– పద్మాజారాణి, జిల్లా అటవీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment