
మనోళ్లు.. మనకే
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో చేపట్టిన రాజ్యసభ సభ్యుల కేటాయింపు ప్రక్రియపై నెలకొన్న టెన్షన్ తొలగిపోయింది. జిల్లాకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు తెలంగాణ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజ్యసభ సభ్యుల కేటాయింపు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియలో.. జిల్లాకు చెందిన ముగ్గురు సభ్యులు తెలంగాణకే కేటాయించబడ్డారు. రాష్ట్రం యూనిట్‌గా లాటరీ పద్ధతి నిర్వహించడంతో ఎవరు ఏ ప్రాంతానికి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై రాజ్యసభ సభ్యుల్లోనూ టెన్షన్ నెలకొంది. లాటరీ పక్రియ ముగియడంతో ఉత్కంఠకు తెరపడింది.
ఆంధ్రప్రదేశ్‌లో 18 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాపోలు ఆనందభాస్కర్, టీడీపీ నుంచి గుండు సుధారాణి, గరికపాటి మోహన్‌రావులు రాజ్యసభ సభ్యులుగా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడే తరుణంలో 11 మంది సభ్యులను ఆంధ్రప్రదేశ్‌కు, ఏడుగురిని తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్నారు. ఎవరిని ఏ ప్రాంతానికి కేటాయించాలనే విషయంపై తేల్చేందుకు లాటరీ పద్ధ నిర్వహించారు. రాజ్యసభ సభ్యుల కేటాయింపు కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో లాటరీ ప్రక్రియను పూర్తి చేశారు.
2016లో ఐదుగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. వీరిలో ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. జిల్లాకు చెందిన గుండు సుధారాణి పదవీకాలం 2016 లోనే ముగియనుంది. లాటరీ కావడంతో ఎలా ఉంటుందోనన్న సందేహం వీడింది.సుధారాణి తెలంగాణకే ప్రాతినిధ్యం వహించేలా లాటరీలో నిర్ణయించారు.
2018లో పదవీకాాలం ముగియనున్న వారిలో ముగ్గురిని తెలంగాణకు కేటాయించారు. జిల్లాకు చెందిన రాపోలు ఆనందభాస్కర్ పదవీకాలం 2018లోనే ముగుస్తోంది. లాటరీలో ఆనందబాస్కర్ తెలంగాణకే వచ్చారు.
ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గరికపాటి మోహన్‌రావు పదవీకాలం 2020లో ముగియనుంది. ఇంకా బాధ్యతలు చేపట్టని మోహన్‌రావు లాటరీలో ఏ రాష్ట్రానికి ఎంపికవుతారనే సందేహం వీడింది. లాటరీలో మోహన్‌రావు తెలంగాణకే వచ్చారు.