
ఖర్చు బారెడు సాగు చారెడు!
కొల్లాపూర్:
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం(ఎంజీఎల్‌ఐ)పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయకట్టు లక్ష్యంలో సగానికి కూడా సాగునీటిని ఇవ్వలేకపోయారు. రూ.2995 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.2650కోట్లకు పైగా ఖర్చుచేశారు. 2012లో ప్రాజెక్టులోని మొదటిలిఫ్ట్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మొదటిలిఫ్ట్ ద్వారా 13వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఖర్చుచేసిన మొత్తానికి, సాగవుతున్న
ఆయకట్టుకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. దాదాపుగా 90శాతం నిధులు ఇప్పటికే ఖర్చుచేసిన అధికారులు లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం పూర్తిగా వెనుకపడిపోయారు. ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్ మినహా మిగతా రెండు లిఫ్టుల్లో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. జొన్నలబొగుడ ఎత్తిపోతల పనులు అరకొరగా సాగుతుండగా గుడిపల్లిగట్టు లిఫ్టు పరిస్థితి మరింత దారుణంగా మారింది.
పనుల్లో నాణ్యతాలోపాలు
ఎంజీఎల్‌ఐ పనుల్లో పూర్తిగా నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. సాగునీటిని విడుదల చేస్తున్న లిఫ్టుల్లో నీటిలీకేజీ కారణంగా పంపుహౌస్ మునిగిపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే పంపుహౌస్‌లోకి నీరు ఎలా చేరిందనే విషయమై ఇప్పటివరకు అధికారులు కచ్చితమైన నిర్ధారణకు రాలేదు. లిఫ్ట్ పనులు చేపట్టిన పటేల్ కంపెనీని వెనకేసుకొచ్చేందుకు అధికారులు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. జొన్నలబొగుడ లిఫ్ట్ వద్ద కూడా గతంలో సర్జిపూల్‌లో మట్టిదిబ్బలు కూలిపడ్డాయి. పంపుహౌస్‌లో కూడా పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
కాగా, ఇటీవల రెండురోజుల క్రితం కురిసిన వర్షాలకు పంపుహౌస్‌లోకి భారీగా నీరు చేరింది. ఇక ప్రాజెక్టు కాల్వల నిర్వహణ అధ్వానంగా మారింది. కొల్లాపూర్ మండలంలో పంటలకు సాగునీరు అందిస్తున్న కాల్వల నిర్వహణ కాంట్రాక్టర్, అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా అస్తవ్యస్తంగా తయారైంది. ఎల్లూరు రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న కాల్వలన్నింటిలో జమ్ము విపరీతంగా పెరిగింది. నీరు ముందుకుపారేందుకు రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. కాల్వలకు లైనింగ్ చేయడం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికారణంగా చాలా మేరకు నీరు భూమిలోనే ఇంకిపోతుంది. ఈ నేపథ్యంలో సోమవాం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అదనపు రిజర్వాయర్ల నిర్మాణం జరిగేనా?
ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని కొల్లాపూర్‌తోపాటు అచ్చంపేట, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాలకు కూడా సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఈ నియోజకవర్గాలకు సాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన రిజర్వాయర్లు మాత్రం లేవు. ప్రస్తుతం నిర్మించిన మూడు రిజర్వాయర్లతోపాటు మినీ రిజర్వాయర్‌గా కొనసాగుతున్న సింగోటం శ్రీవారిసముద్రంతో కలిసి కేవలం నాలుగు టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేసే వీలుంది. అదనపు రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టిసారించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.