కరువు జిల్లాగా ప్రకటించాలి
డీసీసీ అధ్యక్షురాలు సునీత డిమాండ్
నర్సాపూర్ : ‘జిల్లాలో వర్షాలు సరిపడా లేవు. వేసిన పంటలు ఎండిపోయాయి. పూర్తి స్థాయిలో సాగు చేసే పరిస్థితులు లేవు. ఈ దుర్భర పరిస్థితుల్లో మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి. రైతులందరినీ ఆదుకోవాలి’ అని డీసీసీ అధ్యక్షురాలు వి.సునీతారెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదు. వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు పొంది సాగు చేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో పంటలు వేసిన రైతులకు ఆర్థిక సహాయం అందివ్వాలి. ప్రభుత్వం రుణమాఫీ పథకం సక్రమంగా అమలు చేయనందున బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. రుణమాఫీ పథకాన్ని ఎన్నేళ్లు అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాదిరిగా గ్రామం ఒక యూనిట్‌గా పంటల బీమా అమలు చేయాలి. ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా సొమ్ము ఇవ్వకుండా... వారిచ్చిన చెక్కులు వాపసు చేయడం ఎంతవరకు సమంజసం? అధికారుల తప్పిదంతో రైతులకు బీమా వర్తించకుండా పోయింది. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిన మన ఊరు.. మన ప్రణాళిక ఏమైంది! దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు గ్రామ జ్యోతి తెస్తున్నారంటే... వారి పథకాలపై వారికే నమ్మకం లేదా’ అని సునీత ప్రశ్నించారు.
4న ధర్నా...
‘శాశ్వత గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు బిల్లులు చెల్లించలేదు. లబ్ధిదారుల ప్రయోజనాల దృష్ట్యా ఆగస్టు 4న పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేయాలని నిర్ణయించాం. దీన్ని విజయవంతం చేయాలి’ అని సునీత చెప్పారు.