
గాయాల నుంచి కోలుకుని ఇంటికి చేరిన బాలిక
‘మృత్యువు తరుముకొస్తోంది..
►రైలు ప్రమాద ఘటనలో సమయస్ఫూర్తి చూపిన చిన్నారి
►ఇద్దరిని కాపాడి తానూ ప్రాణాలతో బయటపడిన రుచిత
►గాయాల నుంచి కోలుకుని ఇంటికి చేరిన బాలిక
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మృత్యువు తరుముకొస్తోంది.. చావుబతుకుల మధ్య కేవలం 22 సెకన్లే.. అయినా ఓ చిన్నారి అత్యంత ధైర్యసాహసాలను, అంతకు మించి సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. ఎంతటి తెగువ చూపింది అంటే..! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మృత్యువే ఆమె ధైర్యం ముందు మోక రిల్లింది. జూలై 24న మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో ఆ చిట్టితల్లి ఇద్దరు చిన్నారులను బస్సులోంచి తోసేసి వారి ప్రాణాలు కాపాడి తాను కూడా ప్రాణాలతో బయటపడింది. ఆ సాహస బాలిక పేరే రుచితగౌడ్. వెంకటాయపల్లికి చెందిన మల్లాగౌడ్, లత దంపతుల కూతురు రుచితగౌడ్. మూడో తరగతి చదువుతోంది.
ప్రమాదం జరిగిన రోజు డ్రైవర్ వెనకాల మూడో సీట్లో కూర్చుంది. 20 సెకన్ల ముందే ప్రమాదాన్ని పసిగట్టింది. ‘రైలు..రైలు’ అని కేకలు వేసి డ్రైవర్‌ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. ఫలితం లేదు. పక్కకు చూస్తే చిన్నారులు మహిపాల్‌రెడ్డి, సద్భావన్‌దాస్ అమాయకంగా కూర్చున్నారు. వాళ్లకు ఏది ప్రమాదమో కూడా తెలియని వయసు. వాళ్లను లేపి రుచిత బస్సు కిటికీల్లోంచి బయటికి తోసేసింది. కొద్దిగా దూరంతో తన తమ్ముడు వరుణ్ కనిపించాడు.
అతడిని కూడా తోసేందుకు ప్రయత్నించింది. వరుణ్ కొద్దిగా బొద్దుగా ఉండటంతో ఆ చిట్టితల్లికి సాధ్యం కాలేదు. మరోవైపు రైలు బుల్లెట్ వేగంతో వస్తోంది. సమయం మించిపోయింది. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కిటికిలోంచి దూకే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో తలకు కిటికీ పై భాగం బలంగా తాకటంతో తీవ్రంగా గాయపడి చేతకాక సీట్లోనే కూలబడిపోయింది. అంతే..! ఆ క్షణమే రైలు బస్సును ఢీకొట్టింది.
రుచిత తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలోనే ఆమె చెల్లి శృతి చనిపోగా.. తమ్ముడు వరుణ్ తీవ్ర గాయలపాలై మృత్యువుతో పోరాడుతున్నాడు. తలకు, ఛాతికి బలమైన దెబ్బ లు తాకిన వరుణ్ పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని యశోద వైద్యులు ప్రకటించారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా అసమాన ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన రుచిత గౌడ్‌కు సాహస బాలల అవార్డు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.