కొడిగడుతున్న ‘దీపం’ | The gas connection is not available to the poor | Sakshi
Sakshi News home page

కొడిగడుతున్న ‘దీపం’

Published Tue, Jul 22 2014 5:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

కొడిగడుతున్న ‘దీపం’

కొడిగడుతున్న ‘దీపం’

  •       మంజూరైనా పంపిణీలో నిర్లక్ష్యం
  •      అధికారుల నిర్వాకంతో నెరవేరని లక్ష్యం
  •      పేదలకు అందని గ్యాస్ కనెక్షన్
  • సాక్షి, సిటీబ్యూరో: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దీపం’ పథకం అమలు నగరంలో ఘోరంగా ఉంది. గ్యాస్ కనెక్షన్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం ఏటా వేలాది కనెక్షన్లు కేటాయిస్తున్నా ప్రజాప్రతినిధుల అలసత్వం, సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారుల ఎంపిక నుంచి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ వర కు అడుగడుగునా జాప్యంతో ఈ పరిస్థితి దాపురించింది. నాలుగేళ్లుగా గ్యాస్ కనెక్షన్ కోసం వేలమంది అర్హులు నిత్యం సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
     
    అస్తవ్యస్త విధానం..  


    పథకం అమలు బాధ్యతను జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం చూస్తోంది. చీఫ్ రేషనింగ్ కార్యాలయం (సీఆర్వో) కనెక్షన్ల మంజూరు, గ్యాస్ ఏజెన్సీల ఎంపికకే పరిమితమైంది. నిబంధనల ప్రకారం ప్రతి సర్కిల్‌లోనూ స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో వార్డు కమిటీ సమావేశాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది.
     
    దళారులకు పండగ
     
    దీపం పథకంలో అధికారుల నిర్లక్ష్యం చోటామోటా రాజకీయ నేతలు, దళారులకు వరంగా మారింది. వీరు ప్రజలకు కనెక్షన్ ఇప్పిస్తామంటూ వసూళ్లకు ప్పాలడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మరికొందరు స్థానిక ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో అధికారులను కలిసి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. గ్యాస్ ఏజెన్సీల వద్ద సింగిల్ సిలిండర్  కనెక్షన్ తీసుకోవాలంటే రూ.5,418 అవుతుంది. ఇందులో డిపాజిట్ రూ.1,600, మిగతా సిలిండర్, రెగ్యులేటర్, డాక్యుమెంట్ తదితర చార్జీలు ఉంటాయి.

    ‘దీపం’ లబ్ధిదారులు చెల్లించాల్సిన డిపాజిట్ రూ.1,250 సర్కారే చెల్లిస్తుంది. రెగ్యులేటర్, పాస్‌బుక్ ఫీజు కింద కేవలం రూ.150తో పాటు గ్యాస్ ధర కింద మరో రూ. 402  చెల్లిస్తే లబ్ధిదారులకు గ్యాస్‌తో పాటు రెగ్యులేటర్ ఇస్తారు. అయితే, అధికారులు ప్రైవేటు ఏజెన్సీలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే జాప్యం చేస్తున్నారని విమర్శలున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన చాలా మంది ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించి వారి వద్ద కనెక్షన్లు తీసుకుంటున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement