- కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన అర్జీలు
- కార్యాలయాల్లో పరిశీలనకు నోచుకోని వినతులు
- అత్యధికంగా రెవెన్యూ విభాగంలో పెండింగ్
- తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్న ప్రజలు
ప్రజావాణి.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించి, యుద్ధప్రాతిపదికన పరిష్కార చర్యలు చేపట్టే కార్యక్రమమిది. కలెక్టర్‌గా రఘునందన్‌రావు బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని శాఖల అధిపతులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం అర్జీలను ఆయా శాఖలకు పంపారు. కానీ సదరు శాఖల అధికారులు మాత్రం పరిష్కార చర్యలను పక్కనబెట్టారు. ఫలితంగా ఆయా కార్యాలయాల్లో ప్రజావాణి అర్జీలన్నీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. నాలుగు నెలలుగా ప్రజావాణి కార్యక్రమానికి 2,667 అర్జీలు రాగా.. అందులో ఇప్పటివరకు కేవలం 812 అర్జీలను మాత్రమే పరిష్కరించారు. మిగతా 1,855 దరఖాస్తులు సంబంధిత కార్యాలయాల్లో మూల్గుతున్.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో భూములకు అధిక రేట్లు ఉన్న కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ. ఈ క్రమంలో ప్రజావాణకి వచ్చే అర్జీల్లో అధిక శాతం అలాంటివే. కానీ రెవెన్యూ యంత్రాంగం మాత్రం ప్రజావాణి వినతుల పరిష్కారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. గత నాలుగు నెలల్లో జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాలకు సంబంధించి 95 అర్జీలు రాగా.. వాటిలో ఇప్పటివరకు కనీసం ఒక్కదానికీ మోక్షం కలగలేదు. ఇక జిల్లాలోని 37 తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించి 508 అర్జీలు రాగా.. వాటిని ఆయా కార్యాలయాలకు పంపించారు. కానీ వాటిలో ఒక్క అర్జీ సైతం పరిష్కారానికి నోచుకోలేదు. కలెక్టర్ కార్యాలయంతోసహా సీ, డీ, ఈ, ఎఫ్‌అండ్‌జీ సెక్షన్లకు సంబంధించి 162 అర్జీలు ప్రజావాణిలో అందాయి. కానీ వాటిలోనూ ఒక్కటీ పరిష్కారం కాలేదు. మరో 19 ఎంపీడీఓ కార్యాలయాలకు సంబంధించి 33 అర్జీలందగా.. వాటిలోనూ ఒక్కటీ పరిష్కారం కాకపోవడం గమనార్హం.
జిల్లా కార్యాలయాల్లోనూ ఇదే తీరు..
మండల కార్యాలయాల్లో అర్జీల పరిష్కారం అటకెక్కగా.. జిల్లా స్థాయి కార్యాలయాల్లోనూ ఇదే సీను కనిపిస్తోంది. జిల్లా పంచాయతీ శాఖ పరిధిలో 124 వినతులు వచ్చాయి. కానీ ఇందులో ఒక్క వినతికి మోక్షం కలగలేదు.
ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు సంబంధించి 41 అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ శాఖల్లోనూ వినతులు పరిష్కారానికి నోచుకోలేదు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో 149 ఫిర్యాదులు రాగా.. ఒక్కటీ పరిష్కరించలేదు. అధికంగా పీడీ డీఆర్‌డీఏ కార్యాలయానికి సంబంధించి 516 అర్జీలు రాగా.. ఇందులో 342 పరిష్కరించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ పరిధిలో 183 వినతులు రాగా, 111 పరిష్కరించారు.
హడావుడే మిగిలింది.. పరిష్కారం ఆగింది
ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి శాఖ ఉన్నతాధికారి విధిగా పాల్గొనాలని కలెక్టర్ పలు మార్లు హితబోధ చేశారు. అయితే జనవరి, ఫిబ్రవరి మొదటిభాగంలో అధికారులు బాగానే స్పందించినప్పటికీ.. ఆ తర్వాత మమ అనిపించారు. కలెక్టర్ హాజరైన రోజు మినహా మిగతా సందర్భాల్లో వారి హాజరు కనించడం లేదు. కేవలం ప్రజావాణి కార్యక్రమానికి చుట్టపుచూపుగా రావడం తప్ప.. శాఖకు సంబంధించి వినతులు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అటు ప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పడకేసిన ప్రజావాణి
Published Wed, May 20 2015 12:50 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement