పదమూడో ఆర్థిక సంఘం కాల వ్యవధి ముగిసింది. ఆఖరి రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.183 కోట్లు విడుదల చేసింది.
- ముగిసిన 13వ ఆర్థిక సంఘం గడువు
- రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ. 3010 కోట్లు
- వచ్చింది రూ.2110 కోట్లు బకాయి రూ.900 కోట్లు
- ఆఖరి రోజున రూ.183 కోట్లు విడుదల
- మరిన్ని నిధులు వస్తాయనే ఆశలు
సాక్షి, హైదరాబాద్: పదమూడో ఆర్థిక సంఘం కాల వ్యవధి ముగిసింది. ఆఖరి రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.183 కోట్లు విడుదల చేసింది. తొలి ఏడాది కేంద్రం నుంచి వచ్చే నిధులు భారీగా తగ్గిపోవటంతో... రాష్ట్ర బడ్జెట్‌కు భారీగా కోత పడింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం నిధుల విడుదల రాష్ట్ర ఖజానాకు కొంత ఊరటనిచ్చింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పటి నుంచి 13వ ఆర్థిక సంఘం ద్వారా తెలంగాణకు రూ. 3,010 కోట్లు రావాల్సి ఉంది. తాజాగా విడుదలైన నిధులతో కలిపితే ఇప్పటివరకు రూ.2,110 కోట్లు కేంద్రం విడుదల చేసింది.
ఈ లెక్కన మరో రూ. 900 కోట్ల బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసింది. దీంతో పాటు 2010లో అమల్లోకి వచ్చిన 13వ ఆర్థిక సంఘం కాల పరిమితి కూడా ముగిసింది. దీంతో ఈ నిధులు మురిగిపోయే అవకాశముంది. ఈ బకాయిలు విడుదలవుతాయా.. లేదా అనేది సందిగ్ధంగానే మిగిలిపోయింది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన మిగతా బకాయిలను తెచ్చుకునేందుకు ఆర్థిక శాఖ చివరి ప్రయత్నాలు ప్రారంభించింది.
మిగతా నిధులను విడుదల చేయాలని కోరుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి తాజాగా కేంద్రానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. బకాయి ఉన్న రూ. 900 కోట్లలో ఎంతో కొంతైనా విడుదలయ్యే అవకాశముందని, రేపోమాపో ఈ నిధులు వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియను కేంద్రం నిలిపివేయలేదని.. ఈ ప్రక్రియ పురోగతిలో ఉన్నందున మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేస్తున్నారు.