
సమస్యలు పరిష్కరించాలి
► జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్
► అధికారులకు ఆదేశాలు
► కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగం
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉంచకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుని పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అధికారులు తమకు నేరుగా వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయిలో సమస్యలు నేరుగా తన దగ్గరకు వస్తున్నాయని, అక్కడి అధికారులు స్పందించి పరిష్కరిస్తే ప్రజలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదని అన్నారు. అధికారులు గ్రీవెన్స్‌లో, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని, అధికారులు శ్రద్ధగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
అనంతరం గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి జేసీ అర్జీలు స్వీకరించారు. పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. అంతకుముందు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు నేరుగా జేసీ సుందర్ అబ్నార్‌తో ఫోన్‌లో మాట్లాడి తమ సమస్యలను విన్నవించారు. సానుకూలంగా స్పందించిన జేసీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీఆర్వో సంజీవరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ జితేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ వివిధ విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.
కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి
మేము బీడీ కార్మికులం. మాకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయి. బీడీలు చుడుతూ జీవనం కొనసాగిస్తున్నాం. మాతోపాటు బీడీలు చుట్టే వారికి మా గ్రామంలో చాలామందికి పింఛన్లు వస్తున్నాయి. మాకు మాత్రం ఇవ్వడం లేదు. అధికారులను అడిగితే మీకు అక్కడి నుంచి మంజూరు కాలేదంటున్నారు. మాకు పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాం. - బీడీ కార్మికులు, గ్రామం :
మాటేగాం, మం : భైంసా
‘ఉపాధి’ డబ్బులు ఇస్తలేరు
ఉపాధి హామీ పనులు చేసినం. వారం రోజుల కూలీ డబ్బులు ఇస్తలేరు. అధికారులను అడిగితే ఇంకా రాలేదంటున్నారు. రోజుకు రూ.145 ఉంటే మాకు రూ.60 నుంచి 70 ఇస్తున్నారు. వారానికి రూ.400 మాత్రమే అస్తున్నాయి. కూలీ డబ్బులు సరిగ్గా ఇవ్వకుంటే మేం పనులు చేసి ఏం లాభం. మాకు కూలీ డబ్బులు ఇవ్వాలి. - ఉపాధి హామీ కూలీలు, బట్టిసావర్‌గాం, మం : ఆదిలాబాద్