సుజలం.. విఫలం | The supply of fluoride-prone villages Sujala sravanti waters are safe? | Sakshi
Sakshi News home page

సుజలం.. విఫలం

Published Tue, Jan 13 2015 6:12 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

సుజలం.. విఫలం - Sakshi

సుజలం.. విఫలం

ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సరఫరా అవుతున్న సుజల స్రవంతి జలాలు సురక్షితమేనా? తాగటానికి యోగ్యమైనవేనా? ఏ మేరకు శుద్ధి చేస్తున్నారు? ఎలా శుద్ధి చేస్తున్నారు? అనే వి ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. ‘పేరుకే సుజల స్రవంతి పథకం..కానీ వీటి నుంచి సరఫరా అవుతోంది అపరిశుభ్ర జలం. ఈ నీరు తాగిన పలువురు వ్యాధుల బారిన పడు తున్నారు. అత్తెసరు శుభ్రతతో కూడిన కలుషిత జలాన్ని పంపిణీ చేయడమే దీనికి కారణం’ అని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నీటి మూటల్లాంటి హామీలిచ్చే పాలకులే వీటికి సమాధానం చెప్పాలంటున్నారు.    
 
వైరా
వైరా రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న బోడేపూడి సుజల స్రవంతి మంచినీటి పథకం నుంచి ఆరు మండలాల్లోని 120 గ్రామాలకు రోజుకు కోటి లీటర్ల నీరు సరఫరా అవుతోంది. నీరు ఎలా ఉంటున్నాయి? శుభ్రం చేస్తున్నారా? పథకం నిర్వహణ ఎలా ఉందో పర్యవేక్షించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్ల మామూళ్ల మత్తులో పడి అసలు విషయమే మరిచిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. నీటిని శుద్ధిచేసే ముడిపదార్థాలను నాసిరకమైనవి వాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన పైపులైన్‌కు ఏర్పాటు చే సిన ఎయిర్‌వాల్వ్స్, గేట్‌వాల్వ్స్ లీకేజీలతో నీరు కలుషితం అవుతున్నాయి.
 
పనిచేయని ఆలం కలిపే మోటార్
సుజల స్రవంతి మంచినీటి పథకంలో ఆలం కలిపేం దుకు మూడు మోటార్లు వినియోగించాలి. ఏడాడి నుంచి ఈ మూడుమోటార్లు పనిచేయడం లేదు. ఆలం పూర్తిస్థాయిలో కలవడం లేదు. వైరా రిజర్వాయర్‌కు వరదనీరు వచ్చి చేరితే అవే నీటిని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ప్లాంట్‌లో కెమికల్స్, ముడిపదార్థాలు కలిపే కేంద్రాలు అపరిశుభ్రంగా ఉన్నా పట్టడం లేదు. 2002లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులు చేయలేదు. రాడ్లు బయటపడి ప్రమాదకరంగా ఉన్నాయి.
 
నాసిరకంగా ఎయిర్‌వాల్వ్స్
వైరా రిజర్వాయర్ నుంచి వైరా, మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం, తల్లాడ, కొణిజర్ల మండలాల్లో పలు గ్రామాలకు నీటిని సరఫరా చేసే పైపులైన్లకు బిగించిన ఎయిర్‌వాల్వ్స్ దెబ్బతిన్నాయి. గాలి వదలడానికి వాల్వ్‌లో ఉన్న బాల్స్ సరిగా పనిచేయడం లేదు. నీరు లీకై ఎయిర్‌వాల్వ్స్ మురికికూపంగా తయారవుతున్నాయి. తిరిగి అదే నీరు పైపుల ద్వారా సరఫరా అవుతోంది. చాంబర్ల చుట్టూ మురికిపేరుకుపోవడంతో దోమలకు నిలయంగా మారుతున్నాయి.
 
అరకొర నీటి పరీక్షలు
రిజర్వాయర్ వద్ద నీటిశుద్ధి కేంద్రంలో అరకొర పరికరాలు ఏర్పాటు చేశారు. లక్ష లీటర్లకు లీటర్ ఫ్లోరిన్ కలిపి సరఫరా చేయాలి. సరఫరా చేసే ముందు శుద్ధి చేసిన నీటిని పరీక్షించాలి. గతంలో పలుమార్లు ఈ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌లు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తనిఖీ చేసి అసహనం వ్యక్తం చేశారు. అయినా ఈ కేంద్రానికి అవసరమైన పరికరాలు మంజూరు కాలేదంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు.
 
చాంబర్లలో చెత్తాచెదారం..
ఆరు మండలాల్లో 100 ఎయిర్‌వాల్వ్స్, మరో 100 గేట్‌వాల్వ్స్ ఉన్నాయి. ఇవన్నీ శిథిలావస్థకు చేరడంతో నీరు లీకవుతోంది. చెత్తాచెదారం చేరి అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఈ అపరిశుభ్రనీరే తిగిరి గ్రామాల్లోని ట్యాంకులకు చేరుతోంది. ఆ నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.  
 
నామమాత్రం నీటిశుద్ధి
వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న సుజల స్రవంతి మంచినీటి పథకాన్ని పరిశీలించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి రోజు కోటి లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆలాన్ని రెండేళ్ళుగా ఉపయోగించడం లేదని సిబ్బందే అంటున్నారు. నీటిలో ఆమ్లం, క్షారత్వం ఎంత శాతం ఉందని కోలిచేందుకు మాత్రమే క్లోరిన్‌ను వినియోగిస్తున్నారు. ఇది 7-9 శాతం మాత్రమే ఉండాలని తెలిపారు.

6 మండలాలకు వెళ్ళాలంటే సుమారు 60 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలి. నీటిశుద్ధి సరిగా చేయకపోవడం, పీహెచ్‌శాతం ఎంత ఉందో తెలుసుకోవడం లేదు. ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోనూ క్లోరిన్‌కెమికల్స్ కలపడం లేదు. ఎయిర్‌వాల్వ్స్, గేట్‌వాల్వ్స్ లీకవుతున్నాయి. నీరు మురికిగా మారుతోంది. బ్యాక్టీరియా వృద్ధి చెంది పిల్లలు, వృద్ధులు వ్యాధులు బారిన పడుతున్నారు. మోకాళ్లు, కీళ్లనొప్పులు, విషజ్వరాలు వస్తున్నాయి.
 
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
జిల్లాలో ఇటువంటి సుజల స్రవంతి మంచినీటి పథకాలు వైరా, పాలేరు, అడవిమల్లెల, గంగారం, కల్లూరు పెద్దచెరువు, నాగిలిగొండ, చింతకాని మండలాల్లో ఉన్నాయి. వీటి నిర్వహణ కూడా ఇదే విధంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు సుజల స్రవంతికి సరఫరా చేసే క్లోరిన్, ఆలం వంటివి నాసిరకంగా ఉంటున్నాయని తెలుస్తోంది.

నీటి శుద్ధిని పరిక్షించాల్సిన పరికరాలు లేవు. క్లోరిన్‌శాతం కూడా తక్కువగా ఉంటోంది. ముడిపదార్థాలు కలపకుండానే, నీటి పరీక్ష చేయకుండానే గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు ఈ పథకాలను పరిశీలించాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement