గుడిమల్కాపూర్(హన్వాడ) : తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ ఓయువతి కిరోసిన్ పోసుకు ని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం గుడిమల్కాపూర్‌లో చోటుచేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన భీమయ్య, దేవమ్మ కూతురు చెన్నమ్మకు ఈనెల 13న రంగారెడ్డిజిల్లా గండ్వీడ్ మండలం కొమిరెడ్డిపల్లికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. కానీ చెన్నమ్మకు పెళ్లికొడుకు నచ్చలేదు.
తనకు ఈపెళ్లి వద్దని పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన ఆమె తల్లిదండ్రుల వద్ద చెప్పింది. అయినా వారు పట్టించుకోకుండా పెళ్లి చేసేందుకు సిద్ధమవడంతో మనస్తాపానికి గురైంది. గురువారం తెల్లవారుజామున ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుంది. కాసేపటికే గమనించిన కుటుంబీకులు వెంటనే చెన్నమ్మను 108లో జిల్లాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.
ఇష్టంలేని పెళ్లి:యువతి ఆత్మహత్యాయత్నం
Published Fri, Mar 4 2016 2:00 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM