రాష్ట్రంలో 17 సెంట్రల్‌ డయాగ్నొస్టిక్‌ హబ్‌లు | There are 17 central diagnostic hubs in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 17 సెంట్రల్‌ డయాగ్నొస్టిక్‌ హబ్‌లు

Published Sun, Sep 15 2019 2:55 AM | Last Updated on Sun, Sep 15 2019 2:56 AM

There are 17 central diagnostic hubs in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ జిల్లాలను అనుసంధానిస్తూ 17 సెంట్రల్‌ డయాగ్నొస్టిక్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం ‘ఉచిత రోగ నిర్ధారణ కార్యక్రమం’కింద అదనంగా 17 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కేంద్రాలతో పీహెచ్‌సీ మొదలు అన్ని ఆస్పత్రులను అసుసంధానిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలన్నింటిలో తగినన్ని ల్యాబ్‌ సౌకర్యాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం వచ్చినవి 99 శాతం వైరల్‌ జ్వరాలేనని, బాధ్యతలేని నాయకులు ప్రజల్లో భయం కలిగించడం సరికాదన్నారు. పేదలకు సకాలంలో నాణ్యమైన సేవలందించేందుకు, జ్వరాలు రాకుండా పంచాయతీ, మున్సిపల్‌ శాఖల సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఇప్పటికే తాను 11 జిల్లాల్లో పర్యటించినట్టు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రోగుల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో డయాగ్నస్టిక్‌ సెంటర్లలో సదుపాయాలపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ వేసిన ప్రశ్న, ఎమ్మెస్‌ ప్రభాకర్‌ వేసిన అనుబంధ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో కేన్సర్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి ఈటల తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిని 200 పడకల నుంచి 450కు పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. వరంగల్‌లో ప్రాంతీయ కేన్సర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని 2017 డిసెంబర్‌లో కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని తెలిపారు. హైదరాబాద్‌ ఎంఎన్‌జే తరహాలో రాష్ట్రంలోని 2, 3 చోట్ల కేన్సర్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్టు సభ్యుడు ఉల్లోళ్ల గంగాధరగౌడ్‌ వేసిన ప్రశ్నకు బదులిచ్చారు. 

ప్రీప్రైమరీ తరగతులపై త్వరలో నిర్ణయం... 
ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలోనే మూడేళ్లు దాటిన పిల్లలకు తరగతులు నిర్వహించే అంశంపై శిశు సంక్షేమ, విద్యా «శాఖలు కలసి పనిచేస్తున్నాయని చెప్పారు. అన్నం, గుడ్డు పెట్టే కేంద్రాలుగానే అంగన్‌వాడీలను చూడకుండా ప్రీప్రైమరీ విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వేసిన ప్రశ్నకు, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, టీచర్‌ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వేసిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు.

ఈ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించి పాలక, విపక్షాలు చట్టపరమైన అంశాలపై చర్చించి, గతంలోని కేసులు ఉపసంహరించుకుంటే సీఎం ఇచ్చిన హామీ తొందరగా నెరవేరే అవకాశం ఉంటుందన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పురాణం సతీష్‌ వేసిన అనుబంధ ప్రశ్నలకు ఈ సందర్భంగా మంత్రి బదులిచ్చారు. 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నందున వాటిని భర్తీ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు స్పెషల్‌ మెన్షన్‌ కింద ప్రస్తావించారు. మల్బరీ సాగు ప్రోత్సహానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నట్టు సభ్యుడు ఎగ్గె మల్లేశం వేసిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానమిచ్చారు. బహుళ పంటలను ప్రోత్సహించే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, రాబోయే రోజుల్లో ఉపాధి హామీతో మల్బరీ సాగును అనుసంధానించే ఆలోచన ఉందని తెలిపారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement