
జోలెలో గర్భిణీని మోసుకొచ్చిన ఆశ వర్కర్లు
ములకలపల్లి: రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలందడంలేదు. వాహనం సౌకర్యంలేక ఓ గొత్తికోయ మహిళ అటవీ ప్రాంతంలోనే ప్రసవించింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఆదివాసీ గొత్తికోయ గ్రామమైన పూసుగూడెం పంచాయతీ సోయం గంగులునగర్‌కు చెందిన మడకం ధూలెకు శనివారం పురిటి నొప్పులు వచ్చాయి. అయితే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. దీంతో ఆశ కార్యకర్త ధనలక్మి, అంగన్‌వాడీ టీచర్ దుర్గ, ఏఎన్‌ఎం జ్యోతిలు కలసి జోలెలో గర్భిణీని 3 కిలో మీటర్లు మోసుకుంటూ వచ్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే కాన్పు చేశారు. ధూలె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను మంగపేట పీహెచ్‌సీకి తరలించారు. కష్టకాలంలో వెద్య సేవలందించిన ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్‌కు ధూలె భర్త కృతజ్ఞతలు తెలిపాడు.